How To Increase Your Chances Of Credit Card Approval : అత్యవసరంగా షాపింగ్ చేయాలి కానీ జీతం రావడానికి ఇంకా టైం ఉందా? అయితే క్రెడిట్ కార్డు వాడి షాపింగ్ చేయవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ ఉంది కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. అయితే క్రెడిట్ కార్డ్ వాడి హాస్పిటల్ బిల్లు కట్టవచ్చు. ఇలా ప్రతి అవసరానికి క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో ఆర్థిక అవసరాల కోసం చేబదులు తీసుకునేవారు. కానీ నేడు క్రెడిట్ కార్డుల వైపు జనాలు మొగ్గుచూపుతున్నారు. బిల్ జనరేషన్‌కు టైం ఉండటంతో పాటు అనేక ఆఫర్లు, రివార్డులు వస్తుండడమే ఇందుకు కారణం. క్రెడిట్ కార్డుల వల్ల ఇలా చాలా ఉపయోగాలు ఉండటం వల్ల అందరూ వీటిని తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే చాలామందికి క్రెడిట్ కార్డు తీసుకోవాలనే ఆసక్తి ఉన్నా, బ్యాంకులు వారికి కార్డులు మంజూరు చేయకపోవచ్చు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. మరి మీరు కూడా క్రెడిట్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ టాప్-5 టిప్స్ మీ కోసమే.
- క్రెడిట్ స్కోర్: చాలామందికి సరైన క్రెడిట్ స్కోర్ లేకపోవడం వల్ల క్రెడిట్ కార్డులు అనేవి రావు. క్రెడిట్ స్కోర్ అనేది గతంలో మనం తీసుకున్న అప్పులను ఎంతమేరకు చెల్లిస్తున్నాం అనే దాని ఆధారంగా వచ్చే స్కోర్. మనం తీసుకున్న అప్పులను సరిగ్గా చెల్లిస్తుంటే ఈ స్కోర్ బాగుంటుంది. బ్యాంకులు లేదా ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పులను సరిగ్గా చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఫలితంగా కొత్త క్రెడిట్ కార్డు జారీ కాదు. క్రెడిట్ కార్డ్ రావాలంటే క్రెడిట్ స్కోర్ కనీపం 750పైన ఉండాలి. కాబట్టి క్రెడిట్ కార్డ్ కోసం చూసే వాళ్లు ముందుగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడంతో పాటు, అది తక్కువగా ఉంటే దానిని మెరుగుపరుచుకోవాలి.
- సరైన కార్డును ఎంచుకోవడం: చాలామంది క్రెడిట్ కార్డ్ అంటే ఒక్కటే ఉంటుందని భ్రమపడుతుంటారు. ఒక్కో బ్యాంక్ లేదా ఒక్కో ఆర్థిక సంస్థ ఒక్కో తరహా క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంటాయి. అవసరాలకు తగిన విధంగా వాడుకునేలా వీటిని డిజైన్ చేస్తారు. ముందుగా మీకు ఏ క్రెడిట్ కార్డు అవసరం అనేది నిర్ణయించుకోవాలి. క్రెడిట్ కార్డును మనం ఎంత మేరకు వాడుకుంటాం అనే దానిని బట్టి వీటిని ఎంచుకోవడం ఉత్తమం. అర్హత లేని, అవసరానికి ఉపయోగపడని క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.
- స్థిరమైన ఆదాయం: క్రెడిట్ కార్డ్ జారీ చేసేటప్పుడు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మనకు వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. చాలా వరకు స్థిరమైన ఆదాయం వచ్చే వారికి ప్రాధాన్యత ఇస్తుంటాయి. అంటే ప్రతి నెల కొంతమేర ఆదాయం వచ్చేలా ఉన్న వారికి ముందుగా క్రెడిట్ కార్డ్ లభిస్తుంది. కాబట్టి మీరు కూడా స్థిరమైన ఆదాయం వచ్చేలా చూసుకుంటే క్రెడిట్ కార్డు రావడం సులభం అవుతుంది.
- ఆదాయం, అప్పుల నిష్పత్తి : ఆదాయం ఎంత వస్తున్నా కానీ అప్పులు లెక్కలేనన్ని చేసి, వాటికి వడ్డీలు కట్టుకుంటూపోవడం ఏమాత్రం మంచిది కాదు. చాలామంది తాము సంపాదించే దాని కన్నా, అప్పులపై కట్టే వడ్డీలు, ఈఎంఐలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా అప్పులు తక్కువగా, ఆదాయం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వచ్చే ఆదాయంలో 40 శాతానికి మించి అప్పులు చేయకుండా చూసుకుంటే క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- పాత అప్పులు: చాలామంది సంవత్సరాలకు సంవత్సరాలు అప్పులను మెయింటెన్ చేస్తుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. పాత అప్పులను తిరిగి చెల్లించే వారికి క్రెడిట్ కార్డు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కనుక పాత అప్పులు కలిగిన వాళ్లు వెంటనే వాటిని తిరిగి చెల్లించి, వాటి నుండి విముక్తి పొందాలి. ఇలా చేస్తే క్రెడిట్ కార్డ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? పన్ను ఆదా కావాలా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
క్రెడిట్ కార్డు పోయిందా? వెంటనే ఇలా చేయండి- లేదంటే చాలా నష్టం!