How To Book VIP Number For Vehicle : మనదేశంలో వాహనాలు అంటే కేవలం ప్రయాణ సాధనాలు కాదు, వ్యక్తిగత గుర్తింపునకు అద్దంపట్టే చిహ్నాలు. చాలామంది తమ వెహికల్స్‌కు అంతటి ప్రాధాన్యత ఇస్తుంటారు. తమ వాహనం నంబరును ఎంపిక చేసుకోవడంలో చాలామంది వైవిధ్యతకు ప్రయారిటీ ఇస్తారు. ఇలాంటి వాళ్లే వాహనాల కోసం ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లు దక్కించుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ప్రత్యేకించి కొన్ని వాహన నంబర్లపై ప్రజలు ఆసక్తి చూపడటం వెనుక ఆధ్యాత్మికపరమైన కారణం కూడా ఉంది. అదే న్యూమరాలజీ. ఈ శాస్త్రం ప్రకారం తమ పేరుకు తగిన అంకె వచ్చేలా ఫ్యాన్సీ వెహికల్ నంబరును ఎంపిక చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఇంతకీ ఇలాంటి ఫ్యాన్సీ నంబర్లను ఎలా పొందాలి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
RTO ఆఫీసులో ఈ-వేలం
ఫాన్సీ వీఐపీ వెహికల్ నంబరు అంత ఈజీగా దక్కదు. ఆ నంబరు చూడటానికి ఎంత రిచ్‌గా ఉంటుందో, వేలం పాటలో అది పలికే ధర కూడా అంతే రిచ్‌గా ఉంటుంది. చాలామంది లక్షల రూపాయలు చెల్లించి మరీ ఫ్యాన్సీ వీఐపీ వాహనం నంబర్లను దక్కించుకుంటారు. ఈ నంబర్ల కోసం మనం ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్టీఓ) నిర్వహించే ఈ-వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో ఫ్యాన్సీ వాహన నంబర్లను ముందుగా ప్రకటిస్తారు. వాటిలో మనకు ఏ ఫ్యాన్సీ నంబర్ కావాలో ఎంపిక చేసుకోవాలి. ఆయా నంబర్లకు వేటికవి సెపరేటుగా ఈ - వేలం పాట నిర్వహిస్తారు. ఎక్కువగా ఎవరైతే వేలం పాడుతారో వాళ్లకే సదరు ఫ్యాన్సీ వెహికల్ నంబరు దక్కుతుంది.
రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర ఛార్జీలు
ఈ-వేలంపాటలో ఫ్యాన్సీ వెహికల్ నంబరును దక్కించుకున్న వ్యక్తి నిర్దిష్ట రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లించాలి. ఆ నంబరుకు సంబంధించిన బేస్ ధరను 'కాషన్ మనీ(Caution Money)'గా జమ చేయాల్సి ఉంటుంది. ఆ ఫ్యాన్సీ నంబరును సదరు వ్యక్తికి కేటాయించే ప్రక్రియ పూర్తయిన తర్వాత వేలంపాడిన అమౌంట్లోని మిగిలిన మొత్తాన్ని నిర్దిష్ట గడువులోగా ఆర్టీఓ ఆఫీసులో చెల్లించాలి. ఒకవేళ సకాలంలో ఈ మొత్తాన్ని చెల్లించలేకపోతే సదరు ఫ్యాన్సీ నంబరు కోసం పెట్టుకున్న అప్లికేషన్ రద్దు అవుతుంది. 'కాషన్ మనీ'ని దరఖాస్తుదారుడికి తిరిగి ఇచ్చేస్తారు. అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలను మాత్రం తిరిగి ఇవ్వరు.
వాహనానికి ఫ్యాన్సీ నంబరు బుకింగ్ ఇలా
రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖకు (MoRTH) చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో పబ్లిక్ యూజర్‌గా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
- మన అకౌంటు ద్వారా ఆ వెబ్‌సైటులోకి లాగిన్ కావాలి.
- ఆ పోర్టల్‌లో మనకు సమీపంలో ఉండే ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని(ఆర్టీఓ) ఎంపిక చేసుకోవాలి.
- సదరు ఆర్టీఓ కార్యాలయం పరిధిలో అందుబాటులో ఉన్న ఫ్యాన్సీ నంబర్ల జాబితా మనకు కనిపిస్తుంది. దానిలో నుంచి మనకు నచ్చిన నంబరును ఎంపిక చేసుకోవాలి. లేదంటే మనం కోరుకునే అంకెలను అక్కడ ఉండే సెర్చ్ బాక్సులో ఎంటర్ చేసి చూడాలి. ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న ధరలు కూడా అక్కడే డిస్‌ప్లే అవుతాయి.
- ఈ క్రమంలో మనం ఎంపిక చేసుకున్న ఫ్యాన్సీ నంబరుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. దీంతో ఆ నంబరు కోసం జరిగే వేలంపాటలో పాల్గొనేందుకు మీరు అర్హత సాధిస్తారు.
- తదుపరిగా నిర్దిష్ట తేదీలలో ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆన్‌లైన్‌లో ఈ-వేలంపాట నిర్వహిస్తారు. మీకు ముందుగానే దీనిపై సమాచారం అందిస్తారు. సకాలంలో వేలంపాటలో పాల్గొని ఆకర్షణీయమైన రేటును మీరు ఆఫర్ చేస్తే ఆ ఫ్యాన్సీ నంబరు మీ సొంతం అవుతుంది.
- ఈ-వేలం పూర్తయిన తర్వాత ఆ ఫ్యాన్సీ నంబరు కోసం మీరు కాషనరీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం నిర్దిష్ట గడువులోగా మొత్తం ధరను చెల్లించాలి.
- ఆ తర్వాత సదరు వాహన నంబరును మీకు కేటాయిస్తూ రోడ్డు రవాణా శాఖ ఓ లేఖను మీకు అందిస్తుంది.
ఒకే ఏడాదిలో ఉద్యోగాలు మారారా? ITR ఫైలింగ్‌లో ఫారం-16 ఎలా పొందాలంటే? - ITR Form 16