Petrol Pump Scams : ఈ డిటిజల్ యుగంలో ఆన్లైన్లోనే కాదు, పెట్రోలు బంకుల్లో కూడా మోసం చేసి, వినియోగదారుల డబ్బులు కొట్టేస్తున్నారు. ఇంతకూ పెట్రోల్ బంకుల్లో ఎలాంటి మోసాలు జరుగుతాయి? వాటిని ఏ విధంగా గుర్తించాలి? ఎలా ఫిర్యాదు చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
షార్ట్ ఫ్యూయలింగ్ :
పెట్రోల్ బంక్ వాళ్లు చేసే మోసాల్లో షార్ట్ ఫ్యూయలింగ్ ప్రధానమైనది. దీనిని సింపుల్‌గా చెప్పాలంటే, తక్కువ ఇంధనం నింపి, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. అందుకే షార్ట్ ఫ్యూయలింగ్ వంటి మోసాన్ని నివారించేందుకు, మీ వాహనంలో ఇంధనం నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకు మీరు రూ.1,000 విలువైన పెట్రోలు అడిగినప్పుడు, అటెండెంట్ మీటర్‌ను జీరోకు సెట్ చేసి, ఫ్యూయెల్ నింపాల్సి ఉంటుంది. కానీ అతను మీటరు రూ.200 చూపిస్తున్నా, దానిని సరిచేయకుండా అలాగే పెట్రోల్ నింపాడు అనుకుందాం. అప్పుడు మీరు రూ.1000 చెల్లించి, కేవలం రూ.800 విలువైన ఇంధనాన్ని మాత్రమే పొందగలుగుతారు. అంటే ఏకంగా రూ.200 నష్టపోతారు. అందుకే ఇంధనం నింపేటప్పుడు కచ్చితంగా మీటర్‌ను చూడాలి. మీటర్ జీరోకు సెట్ చేసిన తరువాత మాత్రమే పెట్రోల్ లేదా డీజిల్‌ను నింపించుకోవాలి.
ఇంధన సాంద్రత :
పెట్రోల్ బంకువాళ్లు ఫ్యూయెల్ డెన్సిటీ (ఇంధన సాంద్రత)లో కూడా మార్పులు చేస్తుంటారు. ఈ మోసాన్ని నివారించాలంటే, మీటర్లో ఇంధన సాంద్రతను చెక్ చేయాలి. కొన్నిసార్లు మీటర్‌ను కూడా వాళ్లు మానిప్యులేట్ చేస్తుంటారు. కనుక ఇంధనం నింపేటప్పుడు దాని ధారను కూడా పరిశీలించాలి. పెట్రోల్ ఫ్లో చాలా వేగంగా ఉంటే, దాని డెన్సిటీలో మార్పులు చేసి, మిమ్మల్ని మోసం చేస్తున్నారని గుర్తించాలి.
ఈ-చిప్ మోసం
పెట్రోల్ బంకు వాళ్లు ఫ్యూయెల్ డిస్పెన్సింగ్ మెషిన్‌తో ఈ-చిప్‌ను ఇంటిగ్రేట్ చేస్తుంటారు. ఇలా చేసి మీటర్ రీడింగ్‌ను తారుమారు చేస్తారు. ఎలా అంటే? మీటర్లో ఫ్యూయెల్ అమౌంట్, ఫ్యూయెల్ రీడింగ్ రెండూ కరెక్ట్‌గానే కనిపిస్తాయి. కానీ మీ బండిలో నింపిన ఇంధనం మాత్రం తక్కువగా ఉంటుంది. ఇది ఎలా చేస్తారంటే? ఉదాహరణకు మీరు రూ.1000 విలువైన పెట్రోల్ అడిగితే, ముందుగానే ఇ-చిప్‌లో 3 శాతం తక్కువ ఇంధనం నింపేలా సెట్ చేస్తారు. అందువల్ల మీ వాహనంలో రూ.1000 ఇంధనం నింపినట్లు మీటర్లో కనిపిస్తుంది. కానీ దానిలో 3 శాతం ఇంధనం తక్కువగా ఉంటుంది. దీని వల్ల మీరు అనవసరంగా రూ.30 వరకు నష్టపోతారు.
ఫిల్టర్ పేపర్ టెస్ట్
వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం, పెట్రోలు బంకువాళ్లు ఫిల్టర్ పేపర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. ఇంధనం కల్తీ అయ్యిందా? లేదా? అని చెక్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. పెట్రోల్ బంకువాళ్లు కస్టమర్ అడిగితే, కచ్చితంగా ఫిల్టర్ పేపర్ ఇచ్చితీరాలి.
మీరు ఏం చేయాలంటే ఫిల్టర్ పేపర్‌పై కొన్ని చుక్కల పెట్రోలును వేయాలి. అది పూర్తిగా ఆవిరైన తరువాత, పేపర్‌పై ఎలాంటి మరకలు లేకపోతే, అది స్వచ్ఛమైన పెట్రోల్ అని అర్థం. ఒక వేళ పెట్రోల్ ఆవిరైపోయిన తరువాత, పేపర్‌పై మరకలు కనిపిస్తే, అది కల్తీ పెట్రోల్ అని గుర్తించాలి. ఈ విధంగా మీరు పెట్రోలు కల్తీ అయ్యిందా? లేదా? తెలుసుకోవచ్చు.
పెట్రోలు బంక్ వాళ్లు మోసం చేస్తే ఏం చేయాలి?
పెట్రోలు బంకుల్లో మోసం జరిగినట్లు మీరు గుర్తిస్తే, అక్కడే కంప్లైంట్ బుక్ అడిగి, అందులో మీ ఫిర్యాదును రిజిస్టర్ చేయాలి. ప్రతి ఆయిల్ కంపెనీ, ప్రతి పెట్రోల్ బంక్‌లోనూ ఒక కంప్లైంట్ రిజిస్టర్ బుక్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఆడిట్, తనిఖీల సమయంలో వాటిని సమీక్షిస్తుంటుంది. ఒకవేళ అటెండర్ లేదా యజమాని ఫిర్యాదు చేయవద్దని మిమ్మల్ని కోరినా, మీరు మాత్రం ఇలాంటి వాటికి లొంగిపోకూడదు. బంకు వాళ్లు చేస్తున్న మోసంపై ఫిర్యాదు నమోదు చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే, ఆయిల్ కంపెనీ వెబ్సైట్లోనూ సదరు పెట్రోల్ బంక్‌పై ఫిర్యాదు చేయవచ్చు.