MTNL OPERATIONS TO BSNL : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెట్(ఎంటీఎన్ఎల్) కార్యకలాపాలను బీఎస్ఎన్ఎల్కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. తొలుత ఎంటీఎన్ఎల్ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విలీన మార్గం ద్వారా కన్నా, ఒప్పందం ద్వారా ఎంటీఎన్ఎల్ బాధ్యతలను బీఎస్ఎన్ఎల్కు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తొలుత రుణభారంతో ఉన్న ఎంటీఎన్ఎల్ కార్యకలాపాలను ఒప్పందం ద్వారా బీఎస్ఎన్ఎల్కు అప్పగించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఎంటీఎన్ఎల్కు భారీ స్థాయిలో రుణభారం ఉన్న కారణంగా బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయడం సరైన నిర్ణయం కాదని భావించినట్లు సమాచారం. ఎంటీఎన్ఎల్ కార్యకలాపాలు బీఎస్ఎన్ఎల్కు అప్పగించే ప్రతిపాదనను కార్యదర్శుల కమిటీ ముందు ఉంచి, ఆ తర్వాత క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.
"ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంటీఎన్ఎల్ నష్టాల్లో కొనసాగుతోంది. ఎంటీఎన్ఎల్ వద్ద తగినన్ని నిధులు లేకపోవడం వల్ల బాండ్ హోల్డర్లకు వడ్డీ చెల్లించలేకపోతోంది. 7.59 శాతం MTNL యొక్క బాండ్ సిరీస్‌కి సంబంధించి రెండవ సెమీ వార్షిక వడ్డీని జూలై 20, 2024న చెల్లించాల్సి ఉంటుంది. ఎంటీఎన్ఎల్, టెలికాం డిపార్ట్‌మెంట్, బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్‌ల మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం (TPA) ప్రకారం ఎంటీఎన్ఎల్ సెమీ వార్షిక వడ్డీని గడువు తేదీకి 10 రోజుల ముందు చెల్లించాలి." అని ఓ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
తగ్గిన చందాదారులు
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఎంటీఎన్ఎల్ దేశంలోని దిల్లీ, ముంబయిలో సేవలను అందిస్తోంది. ఈ రెండు నగరాలు మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో మరో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వీటితో పోల్చి చూస్తే, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు భారీగా చందాదారులను కలిగి ఉన్నాయి. ఎంటీఎన్ఎల్కు 2023 నాటికి 4.66 మిలియన్లు చందాదారులు ఉండగా, ప్రస్తుతం మరింత మంది తగ్గారు.
నష్టాల్లో కూరుకుపోయిన సంస్థ
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఎంటీఎన్ఎల్ నష్టాలు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.2,915.1 కోట్లు ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరంలో అవి రూ.3,267.5 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్యకలాపాల ద్వారా రూ.798.56 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 14.6 శాతం తక్కువ.
పన్ను ఎగ్గొట్టాలని చూస్తున్నారా? జర జాగ్రత్త! ఐటీ శాఖ ఈజీగా పసిగట్టేస్తుందిలా? - ITR Filing 2024
సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్త కావాలనుకుంటున్నారా? ఈ టాప్-6 టిప్స్ మీ కోసమే! - Business Launch Tips