India's Gold Industry Sets Up A Self-Regulatory Body : దేశీయ పసిడి పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. పసిడి రంగంలో పారదర్శకత పెంచడం సహా, వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించే ఒక స్వయం నియంత్రిత సంస్థ (ఎస్‌ఆర్‌ఓ)ను ప్రకటించింది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) మద్దతుతో ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్స్‌లెన్స్ అండ్ స్టాండర్డ్స్ (ఐఏజీఈఎస్)ను ఏర్పాటు చేసినట్లు మంగళవారం వెల్లడించింది.
ఐఏజీఈఎస్ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి?
స్వతంత్ర పాలన, వృత్తి నిపుణులతో నిర్వహించే ఐఏజీఈఎస్కు సభ్యులను త్వరలోనే ప్రకటించనున్నారు. అనంతరం విధివిధానాలనూ సిద్ధం చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది జనవరి కల్లా ఇది కార్యకలాపాలను ప్రారంభించొచ్చని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (భారత్) సచిన్ జైన్ వెల్లడించారు.
ఐఏజీఈఎస్లో ఎవరెవరు ఉంటారు?
ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్స్‌లెన్స్ అండ్ స్టాండర్డ్స్(ఐఏజీఈఎస్)ను జాతీయ పసిడి పరిశ్రమ సంఘాలైన ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్(ఐబీజేఏ), ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(జీజేసీ), జెమ్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వంటి సంఘాలతో ఏర్పాటు చేస్తారు. పరిశ్రమకు చెందిన వేర్వేరు వర్గాలతో కలిపి దీనిని ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారు, ప్రభుత్వ విశ్వాసాన్ని పొందగలమని జైన్ తెలిపారు.
'భారత పసిడి పరిశ్రమలో ఇదొక మైలురాయి'
ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్స్‌లెన్స్ అండ్ స్టాండర్డ్స్(ఐఏజీఈఎస్) ఏర్పాటు భారత పసిడి పరిశ్రమలో మైలురాయి లాంటిదని జీజేఈపీసీ ఛైర్మన్ విపుల్ షా తెలిపారు. నైతికత, పారదర్శకత, స్థిరత్వంలో అత్యున్నత ప్రమాణాలను రూపొందించడానికి తాము కట్టుబడి ఉండడాన్ని ఇది నిరూపిస్తుందని అభిప్రాయపడ్డారు. వినియోగదారులు, పరిశ్రమ వర్గాల్లో విశ్వాసాన్ని పెంచడం సహా అత్యున్నత నాణ్యతను ప్రోత్సహించడానికి కలిసి పనిచేస్తామని జీజేసీ, ఐబీజేఏ ప్రతినిధులు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా బంగారం ధర ఒకటే!
దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రధాన నగరంలో బంగారం రేట్లు తరచుగా మారుతూ ఉంటాయి. పన్నులు, రవాణా ఖర్చులు, స్థానికంగా ఉన్న డిమాండ్‌తో పాటు అనేక ఇతర విషయాలు బంగారం ధరను నిర్ణయిస్తాయి. తక్కువ పన్నులు, బలమైన మార్కెట్ పోటీ ఉన్న రాష్ట్రాలు తక్కువ ధరకు బంగారాన్ని అందిస్తాయి. అధిక పన్నుల భారం ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో పసిడి రేటు ఎక్కువగా ఉంటుంది. బంగారంపై 'వన్ నేషన్ - వన్ రేట్' పాలసీ త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా బంగారం ధరలు ఒకేలా ఉంటాయి.
'పది రూపాయల నాణెం చెల్లుతుంది - కాదంటే శిక్ష తప్పదు' - ఆర్బీఐ - Awareness On Ten Rupees Coin
EPFO చందాదారులకు గుడ్ న్యూస్ - పర్సనల్ డీటైల్స్ మార్చుకునే అవకాశం! - EPFO New Rules