Fee For Mobile Numbers : సిమ్ కార్డు పొందాలంటే కొన్నేళ్ల క్రితం కొంత రుసుము చెల్లించాల్సి ఉండేది. తర్వాతి కాలంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ కారణంగా ఉచితంగా సిమ్ కార్డులు జారీ మొదలైంది. దీని కారణంగా చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులను తీసుకునేవారు. సిమ్ కార్డు ఫ్రీ టాక్ టైమ్, ఇంటర్నెట్ ప్రయోజనాలు ఉపయోగించుకుని పక్కన పడేసేవారు. ఫోన్ నంబర్ల జారీపై గరిష్ఠ పరిమితి వచ్చాక ఈ తరహా దుర్వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త సిఫార్సులకు సిద్ధమైంది. ఫోన్ నంబర్/ ల్యాండ్ లైన్ నంబర్‌కు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే జరిగితే మొబైల్ ఆపరేటర్ల నుంచి తొలుత ఈ ఛార్జీలు వసూలు చేస్తే ఆయా కంపెనీలు యూజర్ల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉంది.
వాటిని చెక్ పెట్టడమే లక్ష్యం
సహజ వనరుల్లానే ఫోన్ నంబర్ కూడా చాలా విలువైనదని ట్రాయ్ అభిప్రాయపడుతోంది. ఫోన్ నంబర్లు అన్లిమిటెడ్ కాదు కాబట్టి దుర్వినియోగానికి చెక్ పెట్టాలని ట్రాయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఫోన్లు డ్యూయల్ సిమ్ కార్డు ఆప్షన్‌తో వస్తున్నాయి. కొందరు రెండో సిమ్ కార్డు వాడుతున్నప్పటికీ, ఎప్పుడోగానీ వాటికి రీఛార్జి చేయడం లేదు. అయితే, కస్టమర్ బేస్ తగ్గిపోతుందన్న భయంతో ఆయా టెలికాం కంపెనీలు కూడా అలాంటి నంబర్ల జోలికి పోవడం లేదు. వాటిని తొలగించట్లేదు. దీనికి చెక్ పెట్టేందుకు తక్కువ వినియోగం కలిగిన నంబర్ల విషయంలో ఆయా టెలికాం కంపెనీలకు జరిమానా సైతం విధించాలని ట్రాయ్ యోచిస్తున్నట్లు సమాచారం.
ఇతర దేశాల్లో ఛార్జీల వసూలు
గతేడాది డిసెంబర్‌లో పార్లమెంట్లో ఆమోదం పొందిన టెలికాం చట్టంలోనూ మొబైల్ నంబర్‌కు ఛార్జీ వసూలు చేయాలన్న నిబంధన ఉంది. ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, యూకే, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో మొబైల్ నంబర్లకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ట్రాయ్ పేర్కొంది. అయితే, ఒక్కో నంబర్‌కు ఒకసారి మాత్రమే వసూలు చేయాలా? లేదా నంబర్‌కు ఏటా కొంత మొత్తం వసూలు చేయాలా? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రాయ్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన సిఫార్సులను ట్రాయ్ త్వరలో ప్రభుత్వానికి అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2024 మార్చి నాటికి దేశంలో 119 కోట్ల టెలిఫోన్ వినియోగదారులు ఉన్నారు. టెలీ సాంద్రత 85.69 శాతంగా ఉంది. మొబైల్ నంబర్ల డిమాండ్ కూడా ఆమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకువచ్చే యోచనలో ఉంది. కమ్యూనికేషన్ సాంకేతికతలలో పురోగతి, 5జీ నెట్‌వర్క్, మెషిన్-టు-మెషిన్ కమ్యూనికేషన్ విస్తృతమవడం వల్ల ప్రస్తుత నంబరింగ్ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని ట్రాయ్ భావిస్తోంది. నంబర్లకు రుసుము వసూలు చేయడం వల్ల పరిమిత వనరులను సమర్థంగా కేటాయించేందుకు వీలుంటుందని తెలిపింది.
అలర్ట్ - ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్కు మరో 2 రోజులే ఛాన్స్! - Aadhaar Card Free Update Deadline
SBI బంపర్ ఆఫర్ - ఇకపై MSMEలకు 45 నిమిషాల్లోనే లోన్! - SBI DIGITAL MSME LOAN IN 45 MINUTES