EPF Pension Alert : ఈపీఎఫ్ పెన్షనర్లకు శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) దీపావళి సందర్భంగా పెన్షనర్లకు అక్టోబర్ 29న పింఛన్‌ను ఇవ్వనుంది. దీని వల్ల అక్టోబర్ 30నే పెన్షనర్లు తమ పెన్షన్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా దీపావళి జరుపుకునే వీలు కలుగుతుంది.
ఈ ఏడాది దీపావళి - అక్టోబర్ 31 అని కొందరు, నవంబర్ 1 అని మరికొందరు అంటున్నారు. బ్యాంకులు మాత్రం అక్టోబర్ 31న సెలవు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ ముందుగా పెన్షన్ రిలీజ్ చేయడం వల్ల పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఎంతో మేలు చేకూరనుంది.
ఇప్పటికే అన్ని జోనల్, ప్రాంతీయ కార్యాలయాలకు ఈపీఎఫ్ఓ ఎర్లీ పెన్షన్ గురించి సర్క్యులర్ జారీ చేసింది. తమ పరిధిలో పెన్షన్లు చెల్లించే బ్యాంకులకు అవసరమైన సూచనలు చేయాలని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది.
ఈపీఎస్ పెన్షన్
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 అనేది భారత్‌లోని సంఘటిత రంగంలోని ఉద్యోగులకు పింఛన్ అందించే ఒక సామాజిక భద్రతా పథకం. ఈ స్కీమ్‌లో ఉద్యోగితోపాటు, యాజమాన్యం కూడా కంట్రిబ్యూషన్ చెల్లిస్తుంది. అయితే యజమాన్యం ఇచ్చే 8.33 శాతం కంట్రిబ్యూషన్ నేరుగా ఉద్యోగి పెన్షన్ స్కీమ్‌లోకి జమ అవుతుంది.
ఈపీఎస్ పెన్షన్‌కు ఎవరు అర్హులు?
ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ చేసుకున్న మెంబర్లు, కనీసం 10 ఏళ్లు సర్వీస్ ఉన్న వాళ్లు పింఛన్ అందుకోవడానికి అర్హులు. ఎర్లీ పెన్షన్ కావాలంటే ఉద్యోగి వయస్సు కనీసం 50 ఏళ్లు నిండి ఉండాలి. లేదంటే రెగ్యులర్ పెన్షన్ 58 ఏళ్ల నుంచి మొదలవుతుంది.
అంగవైకల్యం ఏర్పడితే?
ఉద్యోగం చేస్తూ ప్రమాదవశాత్తు పాక్షిక అంగవైకల్యానికి, లేదా పూర్తి అంగవైకల్యానికి గురైతే, ఈపీఎఫ్ పథకం కింద వారికి ఆర్థిక సాయం చేస్తారు.
వితంతు పెన్షన్
దురదృష్టవశాత్తు ఈపీఎస్ పింఛనుదారు మరణిస్తే, అతని జీవిత భాగస్వామికి నెలవారీగా వితంతు పింఛను ఇస్తారు. అంతేకాదు పింఛనుదారు పిల్లలకు కూడా ఆర్థిక సాయం చేస్తారు. అయితే గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. వారికి 25 ఏళ్లు వచ్చే వరకు, వారి విద్య, శ్రేయస్సుల కోసం నెలవారీగా ఈపీఎస్ పెన్షన్ ఇస్తారు.
అనాథ పెన్షన్
ఒకవేళ ఈపీఎస్ పింఛనుదారు, అతని జీవిత భాగస్వామి ఇద్దరూ మరణిస్తే, వారి పిల్లలకు నెలవారీ పెన్షన్ అందిస్తారు. ఈ డబ్బును వారు జీవించడానికి, చదువుకోవడానికి వినియోగించవచ్చు.
నామినీ పెన్షన్
ఉదాహరణకు ఈపీఎఫ్‌ఓ సభ్యుడు మరణిస్తే, అతనికి జీవిత భాగస్వామిగానీ, పిల్లలు గానీ లేకపోతే, నామినీకి ఈపీఎస్ పెన్షన్ అందిస్తారు.