Direct Vs Regular Mutual Funds : మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. అవి:
- డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్
- రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్
అయితే ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఈ ఆర్టికల్‌లో ఈ డైరెక్ట్, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి, దేనిని ఎంచుకుంటే మంచి రాబడి వస్తుంది? అనే విషయాలు తెలుసుకుందాం.
ఫండ్ హౌస్‌లు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీ) మ్యూచువల్ ఫండ్స్‌ను అందిస్తూ ఉంటాయి. పెట్టుబడిదారులు వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బులను ఫండ్ మేనేజర్లు చాలా వ్యూహాత్మకంగా ఈక్విటీలు, గవర్నమెంట్ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్స్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. పెట్టుబడిదారుల ఆర్థిక లక్ష్యాలకు, రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా ఫండ్ మేనేజర్లు ఈ మ్యూచువల్ ఫండ్స్‌ను మేనేజ్ చేస్తూ ఉంటారు. అయితే పెట్టుబడిదారులు డైరెక్ట్ లేదా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌లో దేనిని ఎంచుకోవాలన్నదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న.
డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్
డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఫండ్ హౌస్‌లు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు నేరుగా అందించే పెట్టుబడి పథకాలు. కనుక ఫండ్ హౌస్‌కు, పెట్టుబడిదారుడికి మధ్య బ్రోకర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్సియల్ అడ్వైజర్లు లాంటి మధ్యవర్తులు ఎవరూ ఉండరు. అందువల్ల థర్డ్ పార్టీ వ్యక్తులతో సంబంధం లేకుండా నేరుగా పెట్టుబడిదారులే ఈ మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేయడానికి వీలవుతుంది. పైగా కమీషన్లు, పంపిణీ రుసుములు (డిస్ట్రిబ్యూషన్ ఛార్జీలు) లాంటివి చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి పొందే అవకాశం పెరుగుతుంది.
డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌ను నేరుగా ఫండ్ హౌస్ అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. లేదా ఫండ్ హౌస్ కార్యాలయానికి వెళ్లి దానిని యాక్సెస్ చేయవచ్చు.
రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్
రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని బ్రోకర్లు, ఆర్థిక సలహాదారులు, డిస్ట్రిబ్యూటర్లు వంటి మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యవర్తులు పెట్టుబడిదారులకు సలహాలు, సూచనలు చేస్తుంటారు. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సహా, ఆర్థిక లావాదేవీల విషయంలో సేవలు అందిస్తారు. ఇందుకు ప్రతిఫలంగా ఈ మధ్యవర్తులు కమీషన్, పంపిణీ రుసుములు, అదనపు ఛార్జీలు తీసుకుంటారు. వీటిని పెట్టుబడిదారులే భరించాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిదారుల వ్యయ నిష్పత్తి పెరుగుతుంది. కనుక పెట్టిబడిదారులకు వచ్చే రాబడి చాలా వరకు తగ్గుతుంది.
డైరెక్ట్ Vs రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం
- నికర ఆస్తి విలువ : మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ కోసం ఫండ్ హౌస్‌లు చాలా ఖర్చులను భరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అవి మధ్యవర్తులకు కమీషన్, బ్రోకరేజ్‌లను చెల్లించాల్సి ఉంటుంది. కనుక వీటిని మ్యూచువల్ ఫండ్ NAV నుంచి వసూలు చేసుకుంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే, ఫండ్ హౌస్‌లు బ్రోకర్లకు చెల్లించాల్సిన కమీషన్లను, బ్రోకరేజ్‌లను పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసుకుంటాయి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ కమీషన్లు, బ్రోకరేజ్‌లు ఉండవు. కనుక వాటితో పోల్చితే రెగ్యులర్ స్కీమ్ 'నెట్ అసెట్ వాల్యూ' (NAV) కాస్త తక్కువగా ఉంటుంది.
- రాబడి : డైరెక్ట్ ప్లాన్‌ల్లో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలో రాబడి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్ ఫండ్స్‌లో కమీషన్లు, బ్రోకరేజ్‌లు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిపై వచ్చే రాబడి తక్కువగా ఉంటుంది.
- ఆర్థిక సలహాదారు పాత్ర : డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు నేరుగా పెట్టుబడులు పెడతారు. మీ పెట్టుబడులను ఏయే అసెట్ క్లాస్‌ల్లో పెట్టాలో మీరే నిర్ణయిస్తారు. కనుక ఆర్థిక సలహాదారుతో మీకు ఏ పనీ ఉండదు. కానీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. మీ పెట్టుబడుల విషయంలో ఆర్థిక సలహాదారు తగు సూచనలు చేస్తుంటారు. మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఏ విధంగా, ఎంత మేరకు పెట్టుబడి పెట్టాలో చెబుతుంటారు. ఈ విధంగా పెట్టుబడిలపై ఏమాత్రం అవగాహన లేనివారికి ఆర్థిక సలహాదారులు సహాయం చేస్తుంటారు.
ఎంతకీ దేనిని ఎంచుకోవాలి?
స్టాక్ మార్కెట్ పనితీరు గురించి, పెట్టుబడులు గురించి ఏ మాత్రం అవగాహన లేనివారికి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. ఎందుకంటే, ఆర్థిక నిపుణుల సహకారం, మార్గదర్శకత్వం వారికి లభిస్తుంది. మీ ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి అవసరమైన పెట్టుబడి వ్యూహాలను వారు చెబుతారు. కానీ ఈ సేవలు అందించడానికి వాళ్లు కమీషన్ లేదా బ్రోకరేజీ తీసుకుంటారు.
స్టాక్ మార్కెట్‌పై అవగాహన ఉన్నవారు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌పై అవగాహన ఉన్నవారు, ఆర్థిక అంశాల్లో మంచి నైపుణ్యం ఉన్నవారు నేరుగా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. దీని వల్ల బ్రోకరేజీ, కమీషన్లు లాంటి అనవసర రుసుములు తగ్గిపోతాయి. దీని వల్ల దీర్ఘకాలంలో మీరు అధిక రాబడి పొందడానికి వీలవుతుంది.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు చాలా రిస్క్‌తో కూడికొని ఉంటాయి. కనుక ఇలాంటి పెట్టుబడులు పెట్టేముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలా? STP విధానం పాటిస్తే చాలు - లాభాలే లాభాలు! - Mutual Fund STPs