Costliest Metal In The World : ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం ఏది? అంటే చాలా మంది బంగారం అని సమాధానం చెబుతుంటారు. మరికొందరు ప్లాటినమ్ అని కూడా అంటారు. వాస్తవానికి వాటికన్నా విలువైన లోహం ఒకటి ఉంది. అదే రోడియం. ఇది ప్లాటినం సమూహంలోని ఒక సిల్వర్ వైట్ రకానికి చెందిన లోహం. ఇంతకీ రోడియంకు ఎందుకంత రేటు? మన నిత్య జీవితంలో రోడియం ఎలా ఉపయోగపడుతుంది?
80 శాతం ఉత్పత్తి ఆ ఒక్క దేశంలోనే!
ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న రోడియంలో దాదాపు 80 శాతం ఒక్క దక్షిణాఫ్రికా నుంచే వస్తోంది. రష్యా, కెనడాలోనూ ఏటా కొద్ది మొత్తంలో రోడియం ఉత్పత్తి అవుతుంటుంది. రోడియం అనేది ప్రత్యేకంగా ఎక్కడా లభించదు. ప్లాటినం వర్గానికి చెందిన లోహాలలోనే కలిసిపోయి ఉంటుంది. భూమి లోపలి పొరల్లోని అత్యంత ప్రాచీన బండరాళ్లలోనూ రోడియం ఖనిజ నిక్షేపాలు ఉంటాయి.
అయితే వాటి నుంచి రోడియంను వేరు చేయడం చాలా పెద్ద విధానంతో కూడుకున్న పని. ప్లాటినమ్ గ్రూపులోని ఇతర విలువైన లోహాల జాబితాలో ఆస్మియం, రుథేనియం, ఇరీడియం, పలాడియం ఉన్నాయి. వాస్తవానికి గోల్డ్ కంటే వీటి రేట్లే ఎక్కువ. బంగారు గనులతో పోల్చుకుంటే రోడియం ఖనిజ నిక్షేపాలు లభ్యమయ్యే గనులు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్లే రోడియం రేటు ఎల్లప్పుడూ బంగారం రేటు కంటే ఎక్కువగా ఉంటుంది.
ప్లాటినమ్ గ్రూపు లోహాల లాభాలు!
ప్లాటినమ్ గ్రూపులోని లోహాలు తుప్పు నుంచి చాలా నిరోధకతను కలిగి ఉంటాయి. వీటితో తయారు చేసే వస్తువులు, సాంకేతిక ఉపకరణాలు అత్యంత సుదీర్ఘ మన్నికను కలిగి ఉంటాయి. అందుకే ప్లాటినమ్‌కు ప్రపంచంలో అంతగా డిమాండ్ ఉంది. రసాయనిక చర్యల్లో ఉత్ప్రేరకాలుగా పనిచేసే స్వభావం వీటికి ఉంటుంది. అందుకే పలు పరిశ్రమల నుంచి ప్లాటినం లోహాలకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ప్లాటినమ్ అంత ఈజీగా కరగదు. అందుకే అతి తీవ్ర ఉష్ణోగ్రతల నడుమ వినియోగించే సాంకేతిక ఉపకరణాల్లో ప్లాటినమ్ లోహాలను వాడుతుంటారు. ప్రత్యేకించి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆభరణాల పరిశ్రమల్లో ప్లాటినమ్ లోహాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. బంగారం అనేది లగ్జరీకి చిహ్నంగా మారగా ప్లాటినం వర్గంలోని లోహాలు వాటి మన్నిక స్వభావంతో కీలక పరిశ్రమలకు ఆయువుపట్టుగా మారాయి. 95 శాతం స్వచ్ఛమైన ప్లాటినమ్‌తో కూడిన ఆభరణాలు కూడా ప్రముఖ ఆభరణాల దుకాణాల్లో లభ్యమవుతుంటాయి.
మన కారులోనూ రోడియం!
మనం వినియోగించే ప్రతి కారులో క్యాటలిటిక్ కన్వర్టర్ ఉంటుంది. కారు నుంచి విడుదలయ్యే ప్రమాదకర వాయువుల్లో 98 శాతాన్ని ఇది జల్లెడ పట్టి అతి తక్కువ ప్రమాద కారకాలుగా మారుస్తుంది. క్యాటలిటిక్ కన్వర్టర్‌లో రోడియం కూడా ఉంటుంది. కారు నుంచి విడుదలయ్యే అత్యంత వేడి వాయువులను క్యాటలిటిక్ కన్వర్టర్ తట్టుకునేందుకుగానూ అందులో రోడియం తొడుగును అమరుస్తారు. ఉత్ప్రేరకంగా పనిచేసే స్వభావం కూడా రోడియానికి ఉంది. దీంతో అది క్యాటలిటిక్ కన్వర్టర్‌లోకి ప్రవేశించే ప్రమాదకర వాయువుల అణువులను విడగొట్టి, వాటిని బలహీనపరుస్తుంది. దీంతో వాతావరణంలోకి అతి తక్కువ హాని కలిగించే వాయువులు విడుదల అవుతాయి. అంటే పర్యావరణానికి కూడా ప్లాటినమ్ గ్రూపు లోహాలు చాలా మేలు చేస్తున్నాయన్నమాట!