Cash Transaction Income Tax Rules : ఆదాయపు పన్ను శాఖ నిరంతరం ట్యాక్స్ పేయర్స్‌పై నిరంతరం నిఘా ఉంచుతుంది. ఎవరైనా పన్ను ఎగ్గొట్టినా, ఆదాయానికి తగ్గట్టు సక్రమంగా ట్యాక్స్ కట్టకపోయినా వారిపై చర్యలు తీసుకుంటుంది. అలాగే బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తుంటుంది. ముఖ్యంగా నగదు డిపాజిట్లు, విత్ డ్రాలపై దృష్టి పెడుతుంది. మనీలాండరింగ్, పన్ను ఎగవేత, ఇతర చట్టవిరుద్ధమైన ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఇలాంటి చర్యలు చేపడుతుంది. బ్యాంకు అకౌంట్లు, నగదు విత్ డ్రా, డిపాజిట్లపై ఐటీ శాఖ కొన్ని రూల్స్ విధించింది. అవేంటంటే?
ఆ డిపాజిట్లపై 60 శాతం పన్ను
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68 ప్రకారం, బ్యాంకు ఖాతాల్లో క్యాష్ డిపాజిట్ చేసే వ్యక్తులు తమ ఆదాయ మూలాన్ని వెల్లడించడానికి సిద్ధంగా ఉండాలి. వారు అలా చేయడంలో విఫలమైతే 25 శాతం సర్ ఛార్జ్, 4శాతం సెస్ సహా 60శాతం పన్ను పడుతుంది. అప్పటికీ ఐటీ శాఖకు సరైన ఆదాయ వనరును వెల్లడించకపోతే నోటీసులు జారీ చేసి, నగదును రికవరీ చేస్తుంది.
బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు
బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించిన నగదు జమ అయితే తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు నివేదించాలి. కరెంట్ ఖాతాలో డిపాజిట్ లిమిట్ రూ.50 లక్షలు. ఈ లిమిట్ దాటితే నిధుల మూలానికి సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని ఐటీ శాఖకు అందించాలి. లేదంటే తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
విత్ డ్రాలపై టీడీఎస్, టీసీఎస్
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్ ప్రకారం పెద్ద మొత్తంలో నగదు విత్ డ్రాలపై పన్ను చిక్కులు ఉంటాయి. ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో వారి బ్యాంక్ ఖాతా నుంచి రూ. కోటి కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే, మూలంలో 2శాతం పన్ను(టీడీఎస్) పడుతుంది. అయితే, గత మూడేళ్లుగా ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తులకు రూ. 20 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రాలపై టీడీఎస్ వర్తిస్తుంది. రూ.కోటి కంటే ఎక్కువ విత్ డ్రాలపై మూలం (టీసీఎస్) వద్ద 5శాతం పన్ను వర్తిస్తుంది.
ప్రభుత్వ లక్ష్యం అదే!
నగదు చలామణిని తగ్గించి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇలాంటి రూల్స్‌ను తీసుకొచ్చింది. నగదు డిపాజిట్లు, విత్ డ్రాలపై కఠినమైన నిబంధనలను విధించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచాలనే లక్ష్యంగా పెట్టుకుంది.
బ్యాంకు ఖాతాదారులు ఇలా చేయండి
ఆదాయ వనరులు : బ్యాంక్ ఖాతాదారులు తమ ఆదాయ వనరులకు సంబంధించిన స్పష్టమైన రికార్డులను నిర్వహించడం చాలా కీలకం.
లిమిట్స్ : ఆదాయపు పన్ను శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నగదు డిపాజిట్, విత్ డ్రాలను చేయండి.
ఐటీఆర్ : మీ ఐటీఆర్ ను క్రమం తప్పకుండా ఫైల్ చేయండి. అప్పుడు పెద్ద మొత్తంలో విత్ డ్రాలపై అధిక టీడీఎస్ వర్తించదు.