Car Maintenance Tips In Telugu : కారు కొనుగోలు చేయాలనేది చాలా మంది ఆర్థిక లక్ష్యాల్లో ఒకటి. అయితే కారు కొనుగోలు చేయడం ఒక ఎత్తయితే, దానిని మంచి కండీషన్లో ఉంచుకోవడం మరో ఎత్తు. అయితే ఆ కారు ఎక్కువ కాలం మన్నిక రావాలంటే దానిని ఏవిధంగా మెంటెయిన్ చేయాలో తెలియాలి. ఒక వేళ మీరు మొదటిసారిగా కారు కొనుగోలు చేసినట్లయితే, కొన్ని టిప్స్ పాటించి మీ కార్‌ను గుడ్ కండిషన్లో ఉంచుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా?
1. కారు మాన్యువల్ రిఫర్ చేయడం
కారును కొనుగోలు చేసినప్పుడు దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్‌ను ఇస్తారు. అందులో కారుకు సంబంధించిన స్పెషిఫికేషన్స్ నుంచి ఫీచర్ల వరకూ అన్ని వివరాలుంటాయి. మాన్యువల్‌ను చదవడం ద్వారా కారుకు సంబంధించిన చాలా విషయాలపై అవగాహన పొందవచ్చు. అందువల్ల యూజర్ మాన్యువల్‌ను ఎల్లప్పుడూ కారులోనే ఉంచుకోండి. ఒక వేళ దీనిని మర్చిపోయినట్లయితే, సంబంధిత కారు కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించి మోడల్ పేరు ఎంటర్ చేసినా మీరు మాన్యువల్‌ను పొందవచ్చు.
2.టైర్లు
కారు నడవాలంటే టైర్లే కీలకం. వాటి నిర్వహణను ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అందులో తగినంత గాలి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దీంతో పాటు టైర్లకు పగుళ్లు ఏమైనా ఏర్పడ్డాయా ? లేదా ఏమైనా గుచ్చుకున్నాయా? చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ చేసి ఉంటే దాంతో పాటు టైర్ ప్రొటెక్టర్‌ను కూడా కొనుగోలు చేయడం మంచిది.
3.వార్నింగ్ లైట్లు
కారు డాష్ బోర్డులోని వార్నింగ్ లైట్ల గురించి అవగాహన పెంచుకోవాలి. ఇన్ బిల్ట్‌గా కార్లో కొన్ని సెన్సర్లు వస్తాయి. వాటి గురించి తెలుసుకోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి ముందుగానే బయటపడొచ్చు. ఉదాహరణకు ఆయిల్ ట్యాంకు లైట్ అనేది కారులో తక్కువ ఇంధనం ఉన్నప్పుడు మనల్ని అలెర్ట్ చేస్తుంది. దీనితో మనం ముందుగానే మనం ఆయిల్ ఫిల్ చేసుకోవడానికి వీలవుతుంది.
4.ఇంజిన్ క్లీనింగ్
మీ కారు ఇంజిన్‌లో ఏదైనా సమస్య ఉంటే సరిగా పనిచేయదు. కారు సాఫీగా నడవాలంటే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పైగా ఇంజిన్‌లో సమస్య తలెత్తినప్పుడు రిపేర్‌కు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అందువల్ల కారు పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. ఆయిల్ లీకేజీ లేకుండా చూసుకోవాలి. దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి.
5.బ్యాటరీని క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి
కారు స్మూత్‌గా నడవాలంటే బ్యాటరీని సరైన కండీషన్లో ఉంచాలి. బ్యాటరీ జీవిత కాలాన్ని పెంచాలంటే దాన్ని సరిగ్గా మెయింటెన్ చేయాలి. యూజర్ మాన్యువల్ ద్వారా బ్యాటరీ గురించి ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి. బ్యాటరీ టెర్మినల్ కాంటాక్ట్ క్లీన్ చేసుకోవాలి. అంతకు ముందు దాని పవర్ డిస్ కనెక్ట్ చేయడం మర్చిపోవద్దు.
6. బ్రేక్స్ ఫ్లూయిడ్ చెక్ చేయడం
కారు బ్రేక్స్ సరిగా పనిచేయాలంటే అందులో ఫ్లూయిడ్స్ సరిపడా ఉండాలి. అవి తక్కువుగా ఉంటే బ్రేక్స్ పనిచేయడం ఆగిపోతాయి. వీటి గురించి కూడా యూజర్ మాన్యువల్ చదివి తెలుసుకోవచ్చు. ఆ ఫ్లూయిడ్పై ఓ కన్నేసి ఉంచడం ఉత్తమం. దాని రంగు నల్లగా మారినట్లయితే ఫ్లూయిడ్ మార్చాల్సి ఉందని అర్థం.
7. ఆయిల్ ఫిల్టర్స్ మార్చాలి
కారు సరిగా పనిచేసేందుకు లూబ్రికెంట్లు ఉపయోగపడతాయి. వాహనం నడిచేటప్పుడు అందులో ఉత్పన్నమయ్యే వేడిని తీసుకుని, కారు స్మూత్‌గా పనిచేసేలా ఈ లూబ్రికెంట్స్ చేస్తాయి. అందుకే ఆయిల్‌ను ఎప్పటికప్పుడు రీఫిల్ చేయాలి. దీంతో పాటు ఆయిల్‌ను ఫిల్టర్ చేసే ఆయిల్ ఫిల్టర్లను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆయిల్ లాగే ఫిల్టర్స్‌ను కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాలి.
8.స్పార్క్ ప్లగ్ సరిగా పనిచేస్తుందా?
కారు ఇంజిన్ స్టార్ట్ అయ్యేందుకు స్పార్క్ ప్లగ్ కీలకమైంది. ఇందులో ఏదైనా సమస్య ఉంటే కారు స్టార్ట్ అవ్వడంలో అంతారయం కలుగుతుంది. అందుకే దానిపై దృష్టిని పెట్టాలి. ఉదాహరణకు మీ కారులో కీ పెట్టి తిప్పగానే ఇంజిన్ స్టార్ట్ అయితే సమస్య లేదు. కానీ ఎక్కువ సమయం తీసుకుంటే స్పార్క్ ప్లగ్ పాడైనట్లుగా భావించాలి.
9.మంచి మైలేజీ మెయింటెన్ చేయాలి
కారు మంచి మైలేజ్ ఇవ్వడానికి ఏమేం చేయాలో వాటిని యూజర్ మాన్యువల్ ద్వారా తెలుసుకోండి. కారును మంచి కండీషన్లో ఉంచడం, ఫ్యూయెల్ మెయింటెన్ చేయడం లాంటివి చేయాలి. రాష్ డ్రైవింగ్ చేయకుండా ఒక నియమిత వేగంతో వాహనం నడపాలి. భారీ వస్తువులను కారులో తీసుకెళ్లడం వలన మైలేజీ తగ్గే అవకాశం ఉంది.
10.క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్‌ను మార్చడం
కారు లోపలకి మంచి ఎయిర్ ఫ్లో రావాలంటే దాన్ని రెగ్యులర్‌గా రీప్లేస్ చేయాలి. దీంతో పాటు కారులో ఏసీ పనితీరును పరిశీలించాలి. ఏసీ ఆన్ చేసిన తర్వాత కార్లో సరిపడా కూలింగ్ కాకపోతే, ఎయిర్ ఫిల్టర్ సరిగ్గా పనిచేయడం లేదనడానికి ఒక సంకేతం. కనుక ఎయిర్ ఫిల్టర్‌ను ఎలా మార్చాలో యూజర్ మాన్యువల్‌ను చూసి తెలుసుకోండి. ఈ విధంగా కొన్ని బేసిక్ మెయింటెనెన్స్ టిప్స్ పాటిస్తే, మీ కార్ లైఫ్‌స్పాన్ బాగా పెరుగుతుంది.
ఈ 8 తప్పులు చేస్తున్నారా? మీ కారు ఇంజిన్ మటాష్!
రాత్రివేళ కారు హెడ్‌లైట్స్ సరిగ్గా వెలగట్లేదా? - ఈ టిప్స్ పాటించారంటే ఫుల్ లైటింగ్!