BUDGET 2024 ALLOCATION FOR BSNL : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్-2024లో టెలికాం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ కంపెనీల కోసం రూ.1.28 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్‌లకు ఏకంగా రూ.1 లక్ష కోట్లకు పైనే కేటాయించడం విశేషం. ప్రధానంగా బీఎస్‌ఎన్‌ఎల్‌లో సాంకేతిక మెరుగుదల, పునర్నిర్మాణం కోసమే రూ.82,916 కోట్లను కేటాయించారు.
ఇదీ కేటాయింపుల స్వరూపం : 2024-25 ఆర్థిక సంవత్సరానికి టెలికాం రంగానికి నికరంగా రూ.1,28,915.43 కోట్లు (రూ.1,11,915.43 కోట్లు + రూ.17,000 కోట్లు) కేటాయించారు. ఇందులో రూ.17,000 కోట్ల అదనపు కేటాయింపులను కంపెన్సేషన్ టు టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, భారత్‌నెట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ తదితర పథకాలకు ఉపయోగిస్తారు.
- రూ.17,500 కోట్లను టెలికాం విభాగంలోని ఉద్యోగుల పింఛను ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. ఇందులో బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్ ఉద్యోగులు కూడా ఉంటారు.
- ఎమ్‌టీఎన్‌ఎల్ బాండ్ల అసలు మొత్తం చెల్లింపులకు రూ.3,668.97 కోట్లు కేటాయించారు.
BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్
బీఎస్‌ఎన్‌ఎల్ ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైంది. జియో, ఎయిర్‌టెల్, వీఐ (వొడాఫోన్ ఐడియా) లాంటి ప్రైవేట్ టెల్కోలు ఇటీవల తమ టారీఫ్‌లను భారీగా పెంచిన నేపథ్యంలో, చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్తున్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, తమ వినియోగదారులు ఎదుర్కొంటున్న సిగ్నల్ సమస్యలను నివారించేందుకు బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి ముందే, యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించింది.
4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే 12వేల సెల్ టవర్లను ఏర్పాటు చేసింది కూడా. అంతేకాదు 4జీ సేవలు అందించడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్ - టీసీఎస్, తేజస్ నెట్‌వర్క్, ప్రభుత్వ ఐటీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రైవేట్ టెల్కోలు టారిఫ్‌లు పెంచినప్పటి నుంచి దాదాపు 2.5 లక్షల మందికిపైగా బీఎస్‌ఎన్‌ఎల్‌కి పోర్ట్ అవ్వడం గమనార్హం.
MTNL కార్యకలాపాలు BSNL చేతిలోకి
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఎంటీఎన్ఎల్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎంటీఎన్ఎల్ కార్యకలాపాలను బీఎస్ఎన్ఎల్కు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. విలీనం చేయకుండా, కేవలం ఒప్పందం ద్వారా మాత్రమే ఎంటీఎన్ఎల్ బాధ్యతలను బీఎస్ఎన్ఎల్కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
రుణం చెల్లించినా క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా? కారణం ఇదే! - Credit Score Drop