Bike Maintenance Tips : ప్రస్తుత రోజుల్లో మార్కెట్‌కు, ఆఫీసుకు, ప్రయాణాలకు, సరదాగా బయటకు వెళ్లేందుకు, ఇలా ప్రతి దానికీ బైక్ ను వాడుతున్నారు. అయితే బైక్ కండిషన్ మంచిగా ఉంటేనే, ఎక్కువ కాలం రిపేర్లు రాకుండా ఉంటుంది. రెగ్యులర్‌గా బైక్ నిర్వహణ (మెయింటెనెన్స్) చూసుకుంటూ ఉంటే వాహనం పనితీరు బాగుంటుంది. అలానే ఎక్కువ కాలం వాడుకోవడానికి వీలవుతుంది. ఆకస్మాత్తుగా బ్రేక్ డౌన్లు లాంటివి వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. కొన్ని చిట్కాల వల్ల బైక్‌ల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. అలాగే వాటి లైఫ్‌స్పాన్‌ను పెంచుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా?
1. ఇంజిన్ ఆయిల్ మార్చాలి
ఇంజిన్ ఆయిల్ అనేది మన బైక్ ఇంజిన్ ఎక్కువ కాలం పని చేసేలా చేస్తుంది. ఇంజిన్‌ను వేడెక్కకుండా చల్లగా ఉంచుతుంది. కల్తీ ఇంజిన్ ఆయిల్ లాంటివి వాడినప్పుడు, ఇంజిన్ సామర్ధ్యం దెబ్బతింటుంది. అందుకే రెగ్యులర్‌గా ఆయిల్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే ఇంజిన్ ఆయిల్‌ను మార్చుకోవాలి.
2. టైర్లను చెక్ చేసుకోవాలి
అరిగిపోయిన టైర్లతో బైక్‌ను నడపకూడదు. ఒకవేళ అరిగిన టైర్లతోనే బైక్ డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎప్పటికప్పుడు టైర్లను తనిఖీ చేసుకుంటూ, అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవాలి. అలానే టైర్లలో సరిపడా గాలి ఉందా? లేదా? అనేది తరచూ చెక్ చేసుకోవాలి. టైర్లు మంచిగా ఉంటే సురక్షితంగా ప్రయాణించవచ్చు.
3. ఎయిర్ ఫిల్టర్లను క్లీనింగ్ చేయాలి
బైక్ ఎయిర్ ఫిల్టర్లను ఎప్పుటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎందుకుంటే దుమ్ము, ధూళి ఫిల్టర్‌లో పేరుకుపోతే, బైక్ ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఎయిర్ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం, అవసరమైతే దాన్ని మార్చేయడం మంచిది.
4. బ్రేకుల విషయంలో జాగ్రత్త
ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేసేవి బ్రేక్స్. అవి మరీ గట్టిగా లేదా మరీ లూజ్‌గా ఉండకూడదు. బ్రేక్ ప్యాడ్లు కాలక్రమేణా అరిగిపోతుంటాయి. వాటిని మార్చటం అవసరం. అలానే బ్రేక్ వేసేటప్పడు సౌండ్ ఏమైనా వస్తే, వెంటనే వాటిని మార్చాలి. అలానే బ్రేక్స్ సరిగ్గా పనిచేసేందుకు ఆయిల్ వేస్తూ ఉండాలి.
5. బైక్ మాన్యువల్ చదవాల్సిందే
వాహనాలను కొనేటప్పుడు మ్యానువల్ ఇస్తారు. దానిని చాలా మంది చదవకుండా పక్కన పడేస్తారు. దానిలో వాహనానికి సంబంధించిన ప్రతి భాగం గురించి వివరాలు ఉంటాయి. అలానే వాటి నిర్వహణ గురించి, అలానే ఎలాంటి ఆయిల్‌ను ఉపయోగించాలి? టైర్ల సంరక్షణ గురించి ఏం చేయాలి? ఇలా ప్రతి విషయం గురించి సమాచారం ఉంటుంది. కానీ చాలా మంది దానిని చదవకుండా పక్కన పడేస్తుంటారు. కానీ ఇది సరికాదు. కచ్చితంగా మాన్యువల్‌ను చదవాలి.
6. క్లచ్ అడ్జస్ట్మెంట్
టైర్ల లాగానే వివిధ బైక్‌లలో క్లచ్ అడ్జస్ట్మెంట్ కూడా భిన్నంగా ఉంటుంది. గేర్లను మార్చటం కోసం క్లచ్‌ను ఉపయోగిస్తుంటాం. ఒకవేళ క్లచ్ గట్టిగా లేదా వదులుగా ఉంటే గేర్లను మార్చేటప్పుడు సమస్యలు వస్తాయి. దాని వల్ల వాహనానికి డ్యామేజ్ కావచ్చు. కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా దారితీయవచ్చు. బైక్ ఇంజిన్ సామర్థ్యం మంచిగా ఉన్నప్పటికీ, క్లచ్ సరిగ్గా లేకపోతే, బైక్ ఫ్యూయెల్ ఎఫీషియన్సీ తగ్గే అవకాశం ఉంటుంది.
7. బైక్‌ను శుభ్రం చేయాల్సిందే
క్రమం తప్పకుండా వాహనాన్ని శుభ్రం చేసుకోవటం వల్ల వాటి పని తీరు బాగుంటుంది. అలానే ఎక్కవకాలం ఉండేలా చేస్తుంది. మాన్యువల్‌లో చెప్పిన ప్రకారం బైక్‌లను క్లీన్ చేసుకోవాలి. స్విఛ్ యూనిట్, సైలెన్సర్‌ను కూడా శుభ్రం చేసుకోవాలి. బైక్‌ను ఉపయోగించనప్పుడు దానిని కవర్ లేదా ఏదైనా వస్త్రంతో కప్పి ఉంచటం మంచిది.
8. బ్యాటరీ మెయింటెనెన్స్ తప్పనిసరి
బైక్‌ల విషయంలో బ్యాటరీ మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. బ్యాటరీ మంచిగా లేకపోతే సమస్యలు వస్తాయి. ముఖ్యంగా హైడ్ లైట్లు, హార్న్, ఇండికేటర్స్ పనిచేయకపోవడానికి కారణం కావచ్చు. అందుకే వైర్లు అన్నీ సరిగ్గా బ్యాటరీకి కనెక్ట్ అయ్యి ఉన్నాయా? లేదా? అనేది క్రమం తప్పకుండా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ముందుగానే బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌లో ఉందా? లేదా? అనేది చూడాలి. కొంత కాలం పాటు వాహనాన్ని ఉపయోగించకుండా ఉంటే, కచ్చితంగా బ్యాటరీని డిస్కనెక్ట్ చేయటం మంచిది.
9. అనవసర విన్యాసాలు చేయవద్దు!
బైక్‌తో ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్‌తో, రోడ్లపై విన్యాసాలు చేయటం లాంటి వాటి వల్ల ప్రమాదాలు జరుగుతాయి. దీనివల్ల బైక్ పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ట్రాఫిక్ నియమాలను అనుసరించటం, నిబంధనల ప్రకారం, స్పీడ్ లిమిట్ దాటకుండా డ్రైవ్ చేయడం మంచిది.
10. బైక్ చైన్‌ను క్లీన్ చేయాలి
బైక్ గొలుసును క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. అందుకోసం నీటిని వినియోగించకూడదు. బ్రష్ ఉపయోగించి, చైన్‌ను క్లీన్ చేయాలి. తర్వాత చైన్‌కు ఇంజిన్ ఆయిల్ అప్లై చేయాలి.
బోనస్ పాయింట్ : కొందరు బైక్‌ను చక్కగా మెయింటెనెన్స్ చేసుకోగలరు. చిన్న చిన్న రిపేర్లను సొంతంగా చేసుకోగలుగుతారు. అయితే ఏదైనా పెద్ద రిపేర్ వచ్చినప్పుడు బైక్‌ను కచ్చితంగా సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం మంచిది.
రూ.90వేలలో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Scooters Under 90000