2024 Election Effect On India Real Estate : రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశంలో రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రమైన సానుకూల పభావం చూపిస్తాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ అంచనా వేసింది. గత 2014, 2019 ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత పెరిగిన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గణాంకాలు ఈసారి కూడా పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. ఆ మేరకు ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. ఇవి భారత్‌లో గృహ స్థిరాస్తి కొనుగోళ్లపై అనుకూల ప్రభావం చూపిస్తాయని స్పష్టం చేసింది. గత రెండు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నమోదైన డేటా ట్రెండ్‌ల ఆధారంగా ఈ వివరాలను నివేదించినట్లు అనరాక్ సంస్థ తెలిపింది.
2014, 2019లో ఇళ్ల లెక్కలు ఇలా!
India Real Estate Index : అనరాక్ రిపోర్ట్ ప్రకారం- 2014, 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత గృహ విక్రయాలు భారీ రికార్డులను నమోదు చేశాయి. 2014 ఎన్నికల తర్వాత టాప్ 7 నగరాల్లో ఏకంగా 3.45 లక్షల ఇళ్లు అమ్ముడుపోయాయి. ఇక ఆ తర్వాత ప్రభుత్వం తెచ్చిన పలు ఆర్థిక సంస్కరణల కారణంగా 2019 ఎన్నికలకు ముందు ఈ సంఖ్య 5.45 లక్షలకు చేరింది.
అదే విధంగా 2019 ఎన్నికల తర్వాత ఇంటి విక్రయాలు సుమారు 2.61 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే 2016-2019 మధ్య కాలంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త మందకొడిగా సాగినా 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ సమయంలో(2016-2019) సుమారు 2.37 లక్షల ఇళ్ల విక్రయాలు జరిగాయి.
కలిసొచ్చిన ఆర్థిక సంస్కరణలు!
2016-2017లో వచ్చిన నోట్ల రద్దు, రెరా, జీఎస్టీ లాంటి ప్రధాన ఆర్థికపరమైన సంస్కరణలు భారతీయ రియల్ ఎస్టేట్‌ను మరింత వ్యవస్థీకృత పరిశ్రమగా మార్చాయని అనరాక్ నివేదిక తేల్చింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడైతే సంఘటిత రంగం దిశగా పరుగులు తీస్తుందో ఆ సమయంలో చాలామంది ఫ్లై-బై-నైట్ డెవలపర్లు గృహ కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచారు. ఇదే ఇంటి కొనుగోళ్లను పెంచిందని అనరాక్ పేర్కొంది.
2024లో ఇళ్ల అమ్మకాల జోరు!
'ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత నగరాల్లో హౌసింగ్ డిమాండ్ కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ విషయంలో గృహ కొనుగోలుదారులు చాలా ఆశాజనకంగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులు 2024లో రెసిడెన్షియల్ రియల్ మార్కెట్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఎన్నికల ఫలితాల తర్వాత గృహ విక్రయాలు గరిష్ఠ రికార్డులను సృష్టించగలవని నమ్ముతున్నాను' అని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. మొత్తంగా 2014 కంటే 2019లో మెరుగైన హౌసింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని, దీని ఆధారంగా 2019 కంటే 2024లో కూడా అంతకంటే మెరుగైన ఇంటి విక్రయాలు జరుగుతాయని అనరాక్ నివేదిక స్పష్టం చేస్తోంది.
భూమి ధరలు పెరిగాయి ఇలా!
టాప్ 7 నగరాల్లో 2014 తర్వాత ఏడాదికి 6 శాతం మేర ప్లాట్ల రేట్లు పెరిగాయని అనరాక్ డేటా చెబుతోంది. దీని ప్రకారం 2013లో ఒక్క చదరపు అడుగు ధర రూ.4,895గా ఉండగా, 2014లో రూ.5,168కు చేరుకుంది. అదే 2019 తర్వాత ఒక్క చదరపు అడుగు ధర సగటున ఏడాదికి 1 శాతం మేర పెరగ్గా 2018లో చ.అ ధర రూ.5,551 నుంచి 2019లో రూ.5,588కి స్వల్పంగా పెరిగింది. ఇక 2020లో వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం ఊహించని విధంగా పడిపోయింది. అయినా 2021 నుంచి అనుకూల పరిస్థితులు దేశంలో ఏర్పడడం వల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక్కసారిగా పుంజుకుందని అనరాక్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
2024 ఎన్నికల ఫలితాల తర్వాత హౌసింగ్ స్థిరాస్తి వ్యాపారానికి కలిసివచ్చే అంశాలు
- ద్రవ్యోల్బణం గృహ కొనుగోలుదారుల్లో మరిన్ని ఆశలను, విశ్వసాన్ని పెంచుతున్నాయి.
- చాలావరకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ సంస్కరణలు, నిబంధనలు ఇప్పటికే అమలులో ఉన్నాయి.
- IMF వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్ పట్ల బలమైన GDP వృద్ధి అంచనాలను కలిగి ఉన్నాయి.
- రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందనే అంచనాలు ఉన్నాయి. ఇవి పరోక్షంగా రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.
- పటిష్ఠమైన బ్యాలెన్స్ షీట్‌లతో పాటు మంచి ట్రాక్ రికార్డ్‌లు కలిగి ఉన్న చాలామంది డెవలపర్‌లు, బిల్డర్లు తమ ఉనికిని చాటుకోవడానికి రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నారు.
'ఆదివారమైనా ఆరోజు బ్యాంకులన్నీ పనిచేయాలి!' ఆర్బీఐ కీలక ఆదేశాలు
డెడ్‌లైన్ మార్చి 31: ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలా? ఈ ఏడు మార్గాలు పాటిస్తే చాలు! - Tax Saving Ways