Anant Radhika Pre Wedding Venue : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఈ మూడురోజుల సంబరాలకు దేశవిదేశాల నుంచి అతిథులు వస్తున్నారు. ఈవెంట్స్‌కు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ను ఎంచుకోవడం ఆసక్తిగా మారింది. మరి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జామ్‌నగర్‌లో ఎందుకు చేస్తున్నారో జాతీయ మీడియాతో అనంత్ అంబానీ చెప్పారు.
"నేను ఇక్కడే పెరిగాను. ఇక్కడ వేడుక జరుగుతుండటం నా అదృష్టం. ఇది మా నానమ్మ జన్మభూమి. మా తాతయ్య, నాన్న కర్మభూమి. ఇది మీ తాతయ్య అత్తిల్లు అంటూ మా నాన్న తరచూ చెప్తుంటారు. భారత్‌లోనే వివాహాలు చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చినప్పుడు నాకు ఎంతో గర్వంగా అనిపించింది. ఇది నా ఇల్లు"
-- అనంత్ అంబానీ, వ్యాపారవేత్త
'రాధిక నాకు అండగా నిలిచింది'
తాను అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో రాధికా మర్చంట్ ఎంతో అండగా నిలిచిందని అనంత్ వెల్లడించారు. 'నా జీవితంలో రాధిక ఉండటం నా అదృష్టం. ఆమె నా కలలరాణి. ఎప్పుడూ మూగజీవాల సంరక్షణ గురించి ఆలోచించే నేను వైవాహిక జీవితంలోకి అడుగుపెడతానని అనుకోలేదు. కానీ రాధికను కలిసిన తర్వాత మొత్తం మారిపోయింది. మా ఆలోచనలు కలిశాయి. ఆమె మూగజీవాల పట్ల దయతో ఉంటుంది. నేను ఆరోగ్యపరంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో కొండంత అండగా నిలిచింది' అని రాధికపై తన ప్రేమను వ్యక్తం చేశారు అనంత్ అంబానీ. అనంత్ చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడుతున్నారని గతంలో ఆయన తల్లి నీతా అంబానీ తెలిపారు. తన కుమారుడికి ఆస్థమా ఉండటం వల్ల, బరువు తగ్గడం చాలా కష్టంగా మారిందని చెప్పారు.
అతిథులకు 2500 వంటకాలు
ఇదిలా ఉంటే అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. అతిథులకు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ నుంచి 21 మంది చెఫ్‌లను పిలిపించినట్లు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఆహ్వానితులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ ఇలా పలు సంప్రదాయ వంటలను రుచి చూపించనున్నారు. మొత్తంగా 2,500 వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు.
జంతువులపై అంబానీల ప్రేమ- 3 వేల ఎకరాల్లో 'వన్‌తారా' అడవి సృష్టించిన రిలయన్స్ ఫౌండేషన్