Anant Ambani Pre Wedding Celebrations : భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దేశవిదేశాల నుంచి అతిథులు హాజరవుతున్నారు. ప్రముఖుల రాకతో జామ్‌నగర్‌లో సందడి నెలకొంది. టీమ్ఇండియా మాజీ ప్లేయర్ మహేంద్ర సింద్ ధోనీ దంపతులు, క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్, విండీస్ క్రికెటర్ బ్రావో, జహీర్ ఖాన్ దంపతులు, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జామ్‌నగర్‌కు చేరుకున్నారు. అలాగే DLF సీఈఓ కుశాల్ పాల్ సింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖ్య అధికారులు సైతం తరలివచ్చారు.
ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులు జామ్‌నగర్ తరలివచ్చారు. వీరిని ఆహ్వానించేందుకు ఎయిర్‌పోర్టులోనూ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, తన సతీమణి ప్రిసిల్లా చాన్‌తో కలిసి గురువారమే జామ్‌నగర్ చేరుకున్నారు. వారికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఇప్పటికే బాలీవుడ్ నుంచి రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, షారుక్‌ఖాన్ కుటుంబం, అర్జున్ కపూర్, ఆలియాభట్-రణబీర్ కపూర్ కుటుంబం, దర్శకుడు అట్లీ తదితరులు విచ్చేశారు. అటు పాప్ సింగర్ రిహన్నా కూడా జామ్‌నగర్ చేరుకున్నారు.
శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రీవెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరగనున్నాయి. అనంత్, రాధిక నిశ్చితార్థం 2023 జనవరిలో ముంబయిలోని అంబానీ నివాసం యాంటిలియాలో జరిగింది. జులైలో వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు.
అంతకుముందు అతిథులను ఆహ్వానిస్తూ ముకేశ్ సతీమణి నీతా అంబానీ ప్రత్యేక వీడియో సందేశమిచ్చారు. 'మా చిన్న కుమారుడు అనంత్-రాధిక వివాహం విషయానికొస్తే నాకు రెండు ముఖ్యమైన కోరికలున్నాయి. మొదటిది మన మూలాలను గుర్తుంచుకునేలా వేడుకలు నిర్వహించాలని భావించాం. రెండోది ఈ వేడుక మన కళలు, సంస్కృతి, దేశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని కోరుకున్నాం. ఇక, జామ్‌నగర్ మా హృదయాలకు ఎంతో దగ్గరైన ప్రాంతం. నా కెరీర్‌ను ఇక్కడే ప్రారంభించా' అని నీతా ఆ సందేశంలో పేర్కొన్నారు.