Anand Mahindra Love Story : ఆనంద్ మహీంద్రా - పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఆయన. ఒక బిలియనీర్‌గా, వ్యాపారవేత్తగానే కాదు ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన విషయాలు పంచుకోవడంలోనూ ముందుంటారు. అంతేకాదు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుతుంటారు. అలాంటి ఆనంద్ మహీంద్రాకు ఒక ప్రేమ కథ ఉందనే విషయం మీకు తెలుసా?
దాతృత్వానికి మారు పేరు
ఆనంద్ మహీంద్రా భారతదేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. కానీ ఆయన ఏనాడూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడవ్వాలని కోరుకోలేదు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ దానధర్మాలు చేయడంలో ముందుంటారు. ఆయన హార్వర్డ్ హ్యుమానిటీస్ సెంటర్‌కు 10 మిలియన్ డాలర్లు (రూ.84 కోట్లు) విరాళం అందించారు. నాన్హి కాళి ప్రాజెక్టుతో ఏకంగా 1,30,000 మంది అమ్మాయిలకు చేదోడుగా నిలిచారు. నంది ఫౌండేషన్ ద్వారా ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో తన 100 శాతం జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఆయన చేసిన కృషికి గాను అనేక గౌరవ పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. అలాంటి ఆనంద్ మహీంద్రా టీనేజ్‌లో ఒక అమ్మాయితో లవ్‌లో పడ్డారు. ఆ 'లవ్ స్టోరీ' గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అమ్మమ్మ ఇచ్చిన ఉంగరంతో ప్రపోజ్!
ఆనంద్ మహీంద్రా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతుండేవారు. ఒకసారి ఆయన కాలేజ్ అసైన్మెంట్ కోసం ఒక ఫిల్మ్ షూట్ చేయడానికి ఇండోర్ వచ్చారు. అక్కడే ఆయన మొదటిసారి ఓ 17 ఏళ్ల అందమైన యువతిని చూశారు. చూసీ చూడగానే ప్రేమలో పడిపోయారు. ఆమే అనురాధ మహీంద్రా. ఈ అందాల రాశిని చూసిన తరువాత ఆనంద్ తిరిగి హార్వర్డ్‌కు వెళ్లలేకపోయారు. ఆమెతోనే గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఏకంగా ఒక సెమిస్టర్ పరీక్ష రాయకుండా ఉండిపోయారు. అప్పట్లో ఇది ఎంత పెద్ద నిర్ణయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనురాధతో పీకల్లోతు ప్రేమలోకి పడిపోయిన ఆనంద్ మహీంద్రా ఇక ఆగలేదు. బాలీవుడ్ హీరో స్టైల్లో, తన అమ్మమ్మ ఇచ్చిన ఉంగరంతో ఆమెకు ప్రపోజ్ చేశారు. అంతే వీరిద్దరి పెళ్లి 1985 జూన్ 17న పెద్దల సమక్షంలో అంగరంగ వైభోగంగా జరిగిపోయింది.
ఇంతకీ అనురాధ ఎవరు?
అనురాధ - ఆనంద్ మహీంద్రా భార్య మాత్రమే కాదు. ఆమె ప్రసిద్ధ లగ్జరీ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ 'వెర్వ్' వ్యవస్థాపకురాలు. 'మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్'కు సహ వ్యవస్థాపకురాలు కూడా. ముంబయిలో జన్మించిన అనురాధ ప్రతిష్టాత్మక సోఫియా కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. వాస్తవానికి ఆమె సోఫియా కాలేజీలో చదువుతున్నప్పుడే ఆనంద్ మహీంద్రాను మొదటిసారి కలుసుకున్నారు. వెంటనే ప్రేమలో పడ్డారు.
పెళ్లి తర్వాత చదువు!
పెళ్లి తర్వాత ఈ దంపతులు బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా వెళ్లారు. ఈ దంపతులకు దివ్య, అలిక అనే ఇద్దరు కుమార్తెలు కలిగారు. అనురాధ మహీంద్రా బోస్టన్ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ చేశారు. అనంతరం జర్నలిజం, పబ్లిషింగ్‌లో తన కెరియర్ను ప్రారంభించారు.
అనురాధ మహీంద్రా విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఫిలాంత్రొపిస్ట్ కూడా. ఆమె కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ధర్మకర్తలలో ఒకరు. పేద పిల్లలకు విద్య, ఆర్థిక సహాయం అందించడంలో ముందుంటారు. ఆనంద్ మహీంద్రా చేసే ప్రతి పనిలోనూ మద్దతుగా నిలుస్తారు. ఈ విధంగా ఈ ఆదర్శ దంపతులు భారతదేశంలోని చెప్పుకోదగ్గ సెలబ్రిటీ జంటలలో ఒకరుగా కొనసాగుతున్నారు.
'మా నాన్న, తాత కర్మభూమి- అందుకే జామ్‌నగర్‌ను ఎంచుకున్నాం'- ప్రీవెడ్డింగ్ వేదికపై అనంత్ అంబానీ
'అలా చేసినందుకు బ్యాంక్ వాళ్లు పంపించేశారు - ఆమె మాత్రం ఓకే చెప్పారు' - Pullela Gopichand Love Story