HDFC Bank Scheduled Downtime : మన దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC bank) జులై 13న తమ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు, బ్యాంకింగ్ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు ఈ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జులై 13న (శనివారం) ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ అప్‌గ్రేడ్ ప్రక్రియ కొనసాగనుంది. కనుక ఆ సమయంలో ఖాతాదారులకు కొన్ని సర్వీసులు అందుబాటులో ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.
కస్టమర్ల పరిస్థితి ఏమిటి?
భారతదేశంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఏకంగా 93.2 మిలియన్ల (9 కోట్ల 32 లక్షల మంది) కస్టమర్లు ఉన్నారు. కనుక ప్రతి రోజూ భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ సిస్టమ్ అప్‌గ్రేడ్ ప్రక్రియ అనేది సుమారు 13.30 గంటల పాటు కొనసాగుతుంది. కనుక ఆ సమయంలో బ్యాంకింగ్, పేమెంట్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. కస్టమర్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు, జులై 12నే తగినంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలని, ఏవైనా చెల్లింపులు చేయాల్సి ఉంటే, వాటిని ముందస్తుగానే చేసుకోవాలని సూచించింది. తమ ఖాతాదారులపై ప్రభావం తగ్గించేందుకే, సెలవు రోజున అప్‌గ్రేడింగ్ ప్రక్రియను చేపడుతున్నామని తెలిపింది. కనుక దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ సర్వీసులు ఉండవ్!
అప్‌గ్రేడింగ్ ప్రక్రియలో భాగంగా జులై 13వ తేదీ వేకువ జామున 3 గంటల నుంచి 3.45 గంటల వరకు; తెల్లారిన తరువాత ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా పాక్షికంగానే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇక ఏటీఎం/ డెబిట్ కార్డులకు సంబంధించి ఎంపిక చేసిన కొన్ని సర్వీసులు కొంత సమయం పాటు అందుబాటులో ఉండవని తెలిపింది. కానీ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డులను ఆన్లైన్ లావాదేవీల కోసం నిర్దిష్ట పరిమితి మేరకు వాడుకోవచ్చు. అలాగే స్వైప్ మెషీన్ల ద్వారా కూడా నిర్దిష్ట పరిమితి మేరకు క్రెడిట్ కార్డులను వాడుకోవచ్చని హెచ్డీఎఫ్ బ్యాంక్ స్పష్టం చేసింది. డెబిట్ కార్డు యూజర్లు ఏటీఎం నుంచి నిర్దిష్ట పరిమితి మేరకు నగదు కూడా డ్రా చేసుకోవచ్చు అని తెలిపింది.
అలాగే ఏయే సర్వీసులు, ఏయే సమయాల్లో అందుబాటులో ఉంటాయో, ఏ టైమ్‌లో ఉండవో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓ టేబుల్ రూపంలో వెల్లడించింది. అలాగే ఆయా సర్వీసులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
యాక్సిస్ బాంక్ సర్వీసులు ఉండవ్!
దేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ కూడా తమ కస్టమర్లకు జులై 13, 14 తేదీల్లో కొన్ని సర్వీసులు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. యాక్సిస్ బ్యాంక్‌లోకి సిటీ బ్యాంక్ బిజినెస్ విలీన ప్రక్రియ జరగనుండడమే ఇందుకు కారణమని తెలిపింది.
యాక్సిస్ బ్యాంక్‌కు మన దేశంలో ఏకంగా 48 మిలియన్ (4 కోట్ల 80 లక్షల మంది) ఖాతాదారులు ఉన్నారు. కనుక రోజూ భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే జులై 12 రాత్రి 10 గంటల నుంచి జులై 14 ఉదయం 9 గంటల వరకు యాక్సిస్ బ్యాంకు సర్వీసులు అందుబాటులో ఉండవు. ముఖ్యంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు పనిచేయవు. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి NEFT, RTGS, IMPS ద్వారా నగదు లావాదేవీలు, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్లు, లోన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని బ్యాంక్ ఖాతాదారులు గమనించి, ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలి.
యాక్సిస్ బ్యాంక్ 2023 మార్చి 1న సిటీ ఇండియా రిటైల్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. కేవలం 18 నెలల్లో ఇంటిగ్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని పేర్కొంది.
ఐటీఆర్ ఫైలింగ్‌లో ఏమైనా పొరపాట్లు చేశారా? వెంటనే సరిదిద్దుకోండిలా! - How To Correct ITR Mistakes