Multiple Savings Accounts Same Bank : సాధారణంగా ఆర్థిక ప్రయాణం సేవింగ్స్ అకౌంట్‌తోనే మొదలవుతుంది. అందుకే ప్రతి పొదుపు ఖాతాను ప్రాథమిక ఆర్థిక అవసరాలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. పొదుపు ఖాతాలు ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు, అత్యవసరాల కోసం వినియోగించేందుకు ఉపయోగపడతాయి. జీతం నుంచి ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే మొత్తం వరకూ అన్నీ ఇందులోకే వస్తుంటాయి. అయితే చాలా మంది ఒక బ్యాంకులో ఒక సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండొచ్చనుకుంటారు. ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలనైనా ప్రారంభించవచ్చు. కచ్చితంగా చెప్పాలంటే బ్యాంకులో సేవింగ్స్ ఖాతాల సంఖ్యపై ఎలాంటి పరిమితులు లేవు. ఈ క్రమంలో ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలు ఉండడం వల్ల కలిగే లాభనష్టాలేమిటో? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలను కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు
1. ఆర్థిక నిర్వహణ
ఒకే బ్యాంకులో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే మీ ఆర్థిక వ్యవస్థలను సులభంగా విభజించుకోవచ్చు.
ఉదాహరణకు: ఒక ఖాతాను రోజువారీ ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు. మరో ఖాతాను అత్యవసర ఖర్చుల కోసం నగదు ఆదా చేయడానికి కేటాయించుకోవచ్చు.
2. వడ్డీ రేట్లు
బ్యాంకులు తరచూ వివిధ రకాల పొదుపు ఖాతాలకు భిన్నమైన వడ్డీ రేట్లను ఇస్తాయి. అందుకే రెండు ఖాతాలను కలిగి ఉండటం ద్వారా మీరు అధిక వడ్డీ రేటు లేదా అదనపు ప్రయోజనాలను పొందొచ్చు.
ఉదాహరణకు : ఒక వ్యక్తి A, B అనే పొదుపు ఖాతాలను కలిగి ఉన్నాడని అనుకుందాం. ఖాతా Aకి 3.5 శాతం ప్రామాణిక వడ్డీ రేటు వచ్చిందనుకోండి. కొన్ని సార్లు పొదుపు ఖాతా Bకి 4 శాతం వడ్డీ లభించొచ్చు.
3. భద్రత
సాంకేతిక సమస్య వల్ల మీ సేవింగ్స్ ఖాతా ఆగిపోతే, మరో అకౌంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. అలాగే పొదుపు ఖాతాలో సొమ్మును ఉంచుకోవడం ద్వారా మన డబ్బుకు భద్రత ఉంటుంది.
బహుళ పొదుపు ఖాతాలతో నష్టాలివే!
1. మెయింటెన్ చేయడంలో కాస్త ఇబ్బందులు!
బహుళ పొదుపు ఖాతాలు ఉండడం వల్ల వాటిని నిర్వహించడంలో కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్యాలెన్స్ లు, లావాదేవీలు, ఖాతా స్టేట్ మెంట్స్ ను ట్రాక్ చేయడం ఇబ్బంది పడతారు. రెండు ఖాతాలను పర్యవేక్షించడం అంటే రెండు సెట్ ల స్టేట్‌మెంట్స్ పై నిఘా ఉంచడమే. అందువల్ల ఖాతాలు నిర్వహణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
2. అదనపు రుసుములు, ఛార్జీలు
మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోతే బ్యాంకులు రుసుములను వసూలు చేయవచ్చు. ఎక్కువ సేవింగ్స్ అకౌంట్లు ఉన్నప్పుడు అన్నింట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేకపోవచ్చు. దీంతో పెనాల్టీలు తప్పవు.
ఒకే బ్యాంకులో రెండు పొదుపు ఖాతాలను నిర్వహించడం వల్ల లాభనష్టాలు రెండూ ఉంటాయి. అందుకే బహుళ సేవింగ్స్ ఖాతాలను ఓపెన్ చేయడానికి ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, ఖర్చులు, ప్రయోజనాలు, అవసరాలకు పరిగణనలోకి తీసుకోండి. మీరు రెండు ఖాతాలను మెయింటెన్ చేయగలరో లేదో నిర్ధరించుకోండి.
FD చేద్దామనుకుంటున్నారా? ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా? - Fixed Deposit Interest Rates 2024