Adani Acquire Odisha's Gopalpur Port : అపర కుబేరుడు గౌతమ్ అదానీ చేతిలోకి మరో పోర్ట్ చేరింది. ఒడిశాలోని గోపాల్‌పుర్ పోర్టును అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ రూ.3,350 కోట్లకు కొనుగోలు చేసింది.
డబ్బు అవసరమై అమ్మేశాం!
గోపాల్‌పుర్ పోర్టును అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్‌కు విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మంగళవారం ప్రకటించింది. తమ ఆస్తుల నగదీకరణ ప్రణాళికలో భాగంగా రూ.3,350 కోట్లకు దీన్ని అమ్మివేసినట్లు తెలిపింది. ఒడిశాలోని ఈ గోపాల్‌పుర్ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్ మెట్రిక్ టన్నులు.
గతంలో అంటే 2017లో ఒడిశాలో నిర్మాణ దశలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని ఎస్‌పీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఇటీవలే ఈ పోర్ట్‌లో 'గ్రీన్‌ఫీల్డ్ ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్' ఏర్పాటు కోసం 'పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ'తో ఒప్పందం చేసుకుంది కూడా.
ఈ గోపాల్‌పుర్ పోర్ట్ దీర్ఘకాలంలో మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే గత కొన్ని నెలల్లో నౌకాశ్రయాల నుంచి ఎస్‌పీ గ్రూప్ పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుంటోంది. మొదటిసారిగా మహారాష్ట్రలోని ధరమ్‌తర్ పోర్టును రూ.710 కోట్లకు జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు విక్రయించింది. వాస్తవానికి దీన్ని 2015లో కొనుగోలు చేసి, దాని వార్షిక సామర్థ్యాన్ని 1 మిలియన్ టన్నుల నుంచి 5 మిలియన్ టన్నులకు పెంచింది. తాజాగా గోపాల్‌పుర్ పోర్టును కూడా విక్రయించింది.
అప్పులు తగ్గించుకోవడానికే!
రుణాలను తగ్గించుకొని, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ పెట్టుబడి ఉపసంహరణలు చాలా కీలకమని ఎస్‌పీ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. దీని వల్ల భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎస్‌పీ గ్రూప్‌కు ఉన్న కీలక వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశం లభిస్తుందని ఆయన చెప్పారు. ఈ ఎస్‌పీ గ్రూప్‌పై దాదాపు రూ.20 వేల కోట్ల రుణభారం ఉందని అంచనా.
అదానీ పోర్ట్స్ అండ్ టెర్మినల్స్ లిస్ట్!
- గంగవరం పోర్ట్ - ఆంధ్రప్రదేశ్
- కరైకల్ పోర్ట్ - పుదుచ్ఛేరి
- కృష్ణపట్నం పోర్ట్ - ఆంధ్రప్రదేశ్
- ముంద్రా పోర్ట్ - గుజరాత్
- ట్యూనా టెర్మినల్ - గుజరాత్
- దహేజ్ పోర్ట్ - గుజరాత్
- హజీరా పోర్ట్ - గుజరాత్
- మోర్ముగో పోర్ట్ - గోవా
- విజింజిం పోర్ట్ - కేరళ
- కట్టుపల్లి పోర్ట్ - తమిళనాడు
- ఎన్నూర్ టెర్మినల్ - తమిళనాడు
- ధమ్రా పోర్ట్ - ఒడిశా
- దిఘీ పోర్ట్ - మహారాష్ట్ర
బీ అలర్ట్ - ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి న్యూ ట్యాక్స్ రూల్స్! - NEW TAX RULES 2024
2024 ఏప్రిల్ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In April 2024