Youngest Child To Climb Mount Everest : ఎవరెస్టు- ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం. ఈ శిఖరాన్ని అధిరోహించాలంటే బలంగా ఉండాలి. అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాలు, మంచు ప్రతికూల పరిస్థితులు, ఇలాంటి పరిస్థితిలో పెద్ద పెద్దవారే ఎవరెస్టు శిఖరం ఎక్కేందుకు జంకుతుంటారు. అలాంటిది ఓ రెండున్నరేళ్ల సిద్ధి మిశ్ర అనే చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకుంది. భారతదేశంలో అతిపిన్న వయస్సులోనే ఎవరెస్టు పర్వత బేస్ క్యాంపుపైకి ఎక్కిన చిన్నారిగా పేరు తెచ్చుకుంది. బుడిబుడి అడుగులు వేస్తూ ఎవరెస్టును అధిరోహించిన ఆ చిన్నారి సాహసాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.
-
STORY | Toddler girl from Bhopal reaches Mt Everest Base Camp
— Press Trust of India (@PTI_News) March 26, 2024
READ: https://t.co/NFWnc4FzzF
VIDEO: pic.twitter.com/2Mg6ZBdEIy
10 రోజుల్లో 53కి.మీలు!
సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తున భారత పతాకాన్ని ఎగురవేసింది. ఎక్స్ పెడిషన్ హిమాలయ కంపెనీ ఎండీ నబీన్ త్రితాల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. చిన్నారి తన తండ్రి మహీం మిశ్రతోపాటు 2019లో విజయవంతంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తల్లి భావనా దేహరియాలతో కలిసి మార్చి 22న సిద్ధి మిశ్ర ఈ ఘనతను సాధించింది. ఎవరెస్టు ఈశాన్య ప్రాంతంలో ఉన్న నేపాల్లోని లక్లా నుంచి మార్చి 12న పర్వతారోహణను మొదలుపెట్టిన ఈ కుటుంబం 10 రోజుల్లో 53 కి.మీల దూరాన్ని పూర్తి చేసి తామనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. తమ కుమార్తెతో కలిసి ఎవరెస్టును అధిరోహించడంపై భావన సంతోషం వ్యక్తి చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమానికి ఈ విజయాన్ని అనుసంధానం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో స్కాట్లాండ్కు చెందిన రెండేళ్ల చిన్నారి కూడా ఎవరెస్టు బేస్ క్యాంపును చేరుకుంది. ఈ చిన్నారిని తన తండ్రి వీపుపై మోస్తూ పర్వతారోహణ చేశారు. కాగా, గతేడాది అక్టోబర్ 25న బ్రిటన్కు చెందిన రెండేళ్ల బుడ్డోడు టాట్ కార్టర్ ఎవరెస్టు ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పర్వతారోహకునిగా టైటిల్ను దక్కించుకుని అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు. గతంలో చెక్ రిపబ్లిక్కు చెందిన నాలుగేళ్ల చిన్నారి సైతం ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది.