93 Year Old Yog Teacher : యోగా అంటే చాలా మందికి ఆసనాలు గుర్తొస్తాయి. శరీరం ఫిట్‌గా, ఫ్లెక్సిబుల్‌గా మారుతుందని భావిస్తారు. కానీ యోగాతో నయం కాని రోగాలు కూడా దూరమవుతాయని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉందా? అయితే మీరు యోగాచార్య విష్ణు ఆర్య గురించి తెలుసుకోవాల్సిందే. ఆయన 70 ఏళ్లుగా యోగాతో ప్రజల జీవితాల్లో కీలక మార్పులు తీసుకొస్తున్నారు. యోగా ఫలాలు అందిస్తున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం విష్ణు ఆర్య వయసు 93 ఏళ్లు. ఆయన 70 సంవత్సరాలుగా నిరంతరం యోగా సాధనలో నిమగ్నమై ఉన్నారు. ప్రపంచంలోని అనేక నగరాల్లో యోగాలో ప్రజలకు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన వద్ద వందలాది మంది యోగా నేర్చుకుంటున్నారు. తన యోగాభ్యాసానికి అనేక సార్లు సన్మానాలు, అవార్డులు అందుకున్నారు.
యోగా ఎలా ప్రారంభించారు?
తనకు చిన్నప్పటి నుంచి యోగా, వ్యాయామం, రెజ్లింగ్ అంటే చాలా ఇష్టమని విష్ణు ఆర్య చెప్పారు. "1954లో ఆర్యసమాజానికి చెందిన సాధువులు సాగర్‌కు వచ్చారు. సాధువులు చేసే యోగాభ్యాసం నా శరీరంలో ప్రత్యేక సామర్థ్యాలను పెంచింది. యోగా వల్ల ఎన్నో రకాల ఫీట్లు చూపించడం మొదలుపెట్టాం. ఛాతీ మీద రాయి పెట్టి పగలగొట్టినట్లు, ఇనుప కడ్డీని వంచినట్లు చేశాం" అని తెలిపారు.
1968లో రాయ్‌గఢ్‌లో జరిగిన ప్రపంచ యోగా సదస్సులో స్వామి శివానంద శిష్యుడైన స్వామి సత్యానంద్ సరస్వతిని కలిశానని, ఆయన వద్ద యోగాలో దీక్ష తీసుకున్నానని ఆర్య చెప్పారు. "ఆయన ఆసనాలు, ప్రాణాయామం, యోగాలో ముఖ్యమైన శక్తిపాడ్ పద్ధతితో పాటు క్రియా కుండలి యోగాను బోధించారు. ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ, నేను గురూజీతో కలిసి భారతదేశమంతా పర్యటించి ప్రజలకు యోగా నేర్పించాను" అని పేర్కొన్నారు.
యోగా నికేతన్ ఏర్పాటు
1968లో సాగర్‌లో యోగా నికేతన్‌ను స్థాపించినట్లు విష్ణు ఆర్య చెప్పారు. అప్పటి నుంచి ఇక్కడ నిరంతరం యోగాభ్యాసం కొనసాగుతోందని అన్నారు. "మేం ఇక్కడ యోగా ద్వారా మధుమేహం, ఆస్తమా, గర్భాశయ, సయాటికా వంటి నయం చేయలేని వ్యాధులను నయం చేస్తున్నాం. మానసిక ఒత్తిడి కారణంగా శరీరంలో అనేక వ్యాధులు తలెత్తుతాయి. అలాంటి వ్యాధులకు యోగా ద్వారా చికిత్స చేస్తున్నాం. కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర, సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు యోగా ద్వారా తమ వ్యాధులను నయం చేసుకోవడానికి ఇక్కడకు వస్తారు. భగవంతుడు, గురువుల దయతో వారందరికీ సేవలు అందిస్తున్నాం" అన్నారు.
ఆసనాలు, ప్రాణాయామం మాత్రమే కాదు!
యోగా కేవలం ఆసనాలు లేదా ప్రాణాయామం మాత్రమే కాదని, దానికంటే ఎక్కువని విష్ణు ఆర్య అభిప్రాయపడ్డారు. "యోగా అనేది జీవితాన్ని జీవించే కళ, శాస్త్రం. నేటి యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా గుండెపోటు వంటి వ్యాధులు వేగంగా వస్తున్నాయి. ప్రమాదాలు పెరిగి ప్రజలు నేరాల వైపు వెళ్తున్నారు. యోగాలో ఇలాంటివి దూరం చేసే ఆసనాలు ఎన్నో ఉన్నాయి. వాటి ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అనేక వ్యాధులు నయం అవుతాయి. చెడు అలవాట్లను దూరం చేసుకోవచ్చు" అని చెప్పారు.
యోగాచార్యకు జీవితసాఫల్య పురస్కారం
యోగాచార్య విష్ణు ఆర్య యోగాలో శిక్షణ ఇచ్చేందుకు దేశమంతటా పర్యటిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జమ్మకశ్మీర్ రాష్ట్రాలతో పాటు పలు విద్యాసంస్థలు, సైన్యానికి యోగాలో శిక్షణ ఇచ్చారు. దిల్లీలో జరిగిన అనేక కార్యక్రమాల్లో ప్రజలకు యోగా నేర్పించారు. ఇటీవల 70 సంవత్సరాలుగా యోగాభ్యాసంలో గణనీయమైన కృషి చేసినందుకు భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ ఆయనకు జీవితసాఫల్య పురస్కారం అందజేసింది. యోగాను దేశంలోనూ, ప్రపంచంలోనూ ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప చొరవ తీసుకున్నారని విష్ణు ఆర్య అభిప్రాయపడ్డారు.
ఎలాంటి యోగాసనాలైనా ఫుల్ ఈజీగా!- 'హర్షిక' సూపర్ టాలెంట్- ఇంటి నిండా మెడల్సే!! - Child Expert In Yoga
సాహసాల సాహితి- స్విమ్మింగ్‌పూల్‌లో 22గంటలపాటు జలాసనాలు - Woman Yoga Poses in Swimming Pool