Jaishankar On India China Relations : భారత్-చైనా మధ్య గస్తీ ఒప్పందం కుదిరినప్పటికీ విశ్వాసాన్ని పునర్నిర్మించడానికి కొంత సమయం పడుతుందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తెలిపారు. ఇరుదేశాలు పరస్పరం సహకరించుకునేందుకు మరికొంత సమయం అవసరమని చెప్పారు. మహారాష్ట్ర పుణెలోని ఓ యూనివర్సిటీ విద్యార్థులతో శనివారం జై శంకర్ ముచ్చటించి విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
పరస్పర చర్చల వల్లే ఒప్పందం!
భారత్, చైనా మధ్య పరస్పర చర్చల వల్లే ఒప్పందం సాధ్యమైందని జైశంకర్ చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై భారత్ దృష్టిపెట్టడం, సైన్యాన్ని సమర్థంగా మోహరించడం కూడా ఒప్పందం దిశగా చైనా అడుగులు వేసేందుకు దోహదం చేశాయని తెలిపారు. తాజా ఒప్పందం తర్వాత భారత్-చైనా మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయని ఓ విద్యార్థి అడిన ప్రశ్నకు జై శంకర్ సమాధానమిచ్చారు. ‘
"2020 సెప్టెంబర్ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా డెమ్‌చోక్, లద్దాఖ్ ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అప్పటి నుంచి సరిహద్దులో శాంతివాతావరణం నెలకొల్పేందుకు చైనాతో దఫదఫాలుగా చర్చలు కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ సమస్యకు పరిష్కారం దిశగా కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే తాజాగా గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇరుదేశాల సైనికులు అత్యంత సమీపంలో పహారా కాస్తున్నారు. ఊహించని పరిణామాలు ఎదురైతే ఇరుదేశాలూ చాలా కోల్పోవాల్సి వస్తుంది. అనూహ్య పరిస్థితుల్లో భారత్ మిలటరీ బలగాలు అద్భుతంగా పని చేశాయి"
- జై శంకర్, భారత విదేశాంగ మంత్రి
దేనికైనా కొంతకాలం వేచి చూడాలి!
ఇరుదేశాల మధ్య మునుపటి తరహా సంబంధాలు మళ్లీ కొనసాగుతాయా? అని మరో విద్యార్థి ప్రశ్నించగా, అతి త్వరలోనే సాధ్యం కావొచ్చని భావిస్తున్నానట్లు తెలిపారు జైశంకర్. "దేనికైనా కొంతకాలం వేచి చూడాలి. వాళ్లు కూడా సర్దుకోవాలి కదా. దాదాపు నాలుగేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగాయి. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కొంత సమయం అవసరమవుతుంది. కలిసి పని చేయాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం కుదరాలి" అని జై శంకర్ సమాధానమిచ్చారు.