Who Is A Service Voter : ఎన్నికల నిబంధనలు 1961 ప్రకారం సాయుధ బలగాల కోసం పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలంటూ ఎలక్షన్ కమిషన్ అప్పట్లో ఓ ప్రతిపాదనను కేంద్రం ముందుంచుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో అప్పట్నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్‌లోని సైనికులంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ సొంత గ్రామాల్లో ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులకు ఓటు వేయవచ్చు. ఈ ప్రత్యేక ఓటు హక్కు భారత సాయుధ దళాల్లో ఉన్నవారికి మాత్రమే ఉంటుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్వారు విధి నిర్వహణలో భాగంలో సరిహద్దుల్లో ఉంటారు కాబట్టి వారికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, సర్వీస్ అర్హత ఉన్న వ్యక్తి సర్వీస్ ఓటర్ కేటగిరీ కిందకు వస్తారు.
ఇంతకీ ఎవరీ సర్వీస్ ఓటర్?
Service Voter : భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆర్మీ యాక్ట్, 1950 నిబంధనల ప్రకారం సర్వీస్ ఓటర్‌గా పరిగణిస్తారు. ఒక రాష్ట్ర పోలీసు విభాగంలో ఉండి మరో రాష్ట్రంలో సేవలందిస్తున్న పోలీసులు కూడా సర్వీస్ ఓటర్ కిందకే వస్తారు. విదేశాల్లో విధి నిర్వహణలో ఉన్న భారత ఉద్యోగులను కూడా సర్వీస్ ఓటర్‌గానే పరిగణిస్తారు.
సర్వీస్ ఓటర్‌కు- సాధారణ ఓటర్‌కు తేడా ఏంటి?
సాధారణ ఓటరు తన నివాస స్థలం ఉన్న నియోజకవర్గ ఓటర్ల జాబితాలో నమోదై ఉంటాడు. కానీ సర్వీస్ ఓటర్ అర్హత కలిగిన ఉద్యోగి ప్రస్తుతం వేరే ప్రదేశంలో ఉద్యోగం చేస్తున్నా అతని స్వస్థలంలోనే సేవా లేదా సర్వీస్ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అలాగే తాను పని చేస్తున్న స్థలంలో కూడా ఓ సాధారణ పౌరుడిగా ఓటు హక్కును నమోదు చేసుకునే హక్కును కలిగి ఉంటాడు.
సాయుధ బలగాలు, పారా మిలిటరీ ఉద్యోగులు సర్వీస్ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులా?
ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, అసోం రైఫిల్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమా బల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు సర్వీస్ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.
సర్వీస్ ఓటరు నమోదు ప్రక్రియ
సర్వీస్ ఓటరుగా నమోదు చేసుకుంటే సంవత్సరానికి రెండుసార్లు అప్‌డేట్ చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను రక్షణ, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎన్నికల సంఘం పంపుతుంది. సేవా లేదా సర్వీస్ ఓటర్ ప్రక్రియ ప్రకటించిన వెంటనే, సేవా అర్హతలు ఉన్న వ్యక్తులు చట్టబద్ధమైన ఫారమ్ 2/2A/3లో దరఖాస్తును నింపి దానిని రికార్డ్ ఆఫీస్ ఇన్‌ఛార్జ్ అధికారికి లేదా విదేశీ మంత్రిత్వ శాఖలోని నోడల్ అథారిటీకి పంపించాలి. తాము ఏ నియోజకవర్గంలోనూ సాధారణ ఓటర్లుగా నమోదు చేసుకోలేదని ఉద్యోగి డిక్లరేషన్‌ను సమర్పించాలి. ఈ అప్లికేషన్‌ను అధికారి తనిఖీ చేస్తారు. దరఖాస్తుదారుడు నింపిన వివరాలు సరైనవని అనిపిస్తే ఇన్‌ఛార్జ్ అధికారి, ఫారమ్‌లోనే అందించిన ధృవీకరణ సర్టిఫికేట్‌పై సంతకం చేసి, దానిని ఎన్నికల ప్రధాన అధికారికి పంపుతారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆ ఫారమ్‌ను సంబంధిత జిల్లా ఎన్నికల అధికారికి పంపుతారు, జిల్లా నుంచి ఆ ఫారమ్ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి పంపుతారు. అప్పుడు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సర్వీస్ ఓటు హక్కును సదరు ఉద్యోగికి కల్పిస్తారు.
భార్య పిల్లలను కూడా సర్వీస్ ఓటర్‌గా నమోదు చేయవచ్చా?
ఎన్నికల సంఘం ప్రకారం, ఉద్యోగి భార్య సర్వీస్ ఓటరు(భర్త)తో నివసిస్తున్నట్లయితే, ఆ వ్యక్తి పేర్కొన్న నియోజకవర్గంలోనే ఆమెను కూడా సర్వీస్ ఓటరుగా పరిగణిస్తారు. అయితే సర్వీస్ ఓటరు తన భార్య తనతో నివసిస్తుందని ధ్రువీకరించాలి. ఉద్యోగి సమర్పించిన దరఖాస్తు ఫారమ్‌లోనే చేసిన డిక్లరేషన్ ఆధారంగా సర్వీస్ ఓటరుగా ఆమె భార్యను నమోదు చేస్తారు. దీని కోసం ఉద్యోగి భార్య ప్రత్యేకంగా దరఖాస్తును నింపాల్సిన అవసరం లేదు. అయితే సర్వీస్ ఓటరుతో నివసించే కుమారుడు, కుమార్తె, బంధువు, సేవకుడు మొదలైనవారిని సర్వీస్ ఓటర్లుగా నమోదు చేయరు. ప్రస్తుత చట్టం ప్రకారం సర్వీస్ ఓటర్ సదుపాయం భార్యభర్తలకు మాత్రమే ఉంటుంది. కాగా, మహిళా ఉద్యోగి భర్తకు సర్వీస్ ఓటరు అందుబాటులో ఉండదు.
ఏకకాలంలో సర్వీస్, సాధారణ ఓటరు కాగలరా?
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్లు 17, 18 నిబంధనల ప్రకారం ఒక వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదు చేయలేరు. సర్వీస్ ఓటరు తనను తాను సర్వీస్ ఓటరుగా లేదా సాధారణ ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది.
ప్రాక్సీ ఓటు అంటే?
What Is Proxy Voting : వర్గీకృత సర్వీస్ ఓటరు ఆర్మీ చట్టం 1950లోని నిబంధనలు వర్తించే సాయుధ బలగాలకు చెందిన సర్వీస్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా లేదా ఆయన నియమించిన ప్రాక్సీ ఓటరు ద్వారా ఓటు వేసే అవకాశం ఉంది. ప్రాక్సీ ద్వారా ఓటు వేయడానికి ఎంచుకున్న సేవా ఓటరును క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్‌గా పిలుస్తారు.
ప్రాక్సీ ఓటు ఎలా ఉంటుంది?
తమకు బదులుగా ఇతరులను ఎంపిక చేసి ఓటు వేయించే ప్రక్రియను ప్రాక్సీ ఓటు అంటారు. ఈ సౌలభ్యాన్ని ఇంటెలిజెన్స్ లాంటి విభాగాల్లో పనిచేస్తున్న వారు వినియోగించుకుంటారు. అయితే ఇటువంటి ఓట్లు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి.
ఆరంభంలోనే భగ్గుమంటున్న భానుడు -వేసవిలో ఆరోగ్యం కాపాడుకునేదెలా! - SUMMER Health Tips