Votes Counting In Supreme Court : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనేక వింత సంఘటనలు, ఎన్నో ఆశ్చర్యపరిచే సన్నివేశాలు జరిగాయి. ఇవి అభ్యర్థుల ప్రచారంలో, పోలింగ్ కేంద్రాల్లో, లేదా ఓటింగ్ సమయాల్లో జరిగి ఉండవచ్చు. అలా జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ఇవే కాకుండా ఒక్కోసారి నాయకుల గెలుపోటముల విషయంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగి ఉండవచ్చు. అలాంటి ఒక సంఘటనే 57 ఏళ్ల క్రితం హరియాణాలో జరిగింది. అదే కర్నాల్ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఓట్ల రీకౌంటింగ్ ప్రక్రియను సుప్రీంకోర్టులో నిర్వహించడం.
సుప్రీం కోర్టులో తొలిసారి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు న్యాయమూర్తులు. అవి 1967లో జరిగిన నాలుగో లోక్‌సభ ఎన్నికలు. తనపై పోటీ చేసిన అభ్యర్థి అక్రమంగా గెలిచారని, ఓట్లను మళ్లీ లెక్కించాలని అప్పటి ప్రధాన పార్టీ తరఫున పోటీ చేసిన ప్రత్యర్థి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణలో భాగంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సుప్రీం కోర్టులో నిర్వహించాల్సి వచ్చింది.
ఇదీ జరిగింది
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1967లో నాలుగో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో హరియాణా అప్పటి పానిపట్ రాష్ట్రంలోని కర్నాల్ నియోజకవర్గంలో జన్‌సంఘ్ పార్టీ తరఫున స్వామి రామేశ్వర్ నంద్ బరిలో నిలిచారు. ఈయనకు పోటీగా స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త మాధవ్ రామ్ శర్మను పోటీలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో మాధవ్ రామ్ శర్మ కేవలం 55 ఓట్లతో గెలుపొందారు. తన ఓటమిని జీర్ణించుకోలేని నంద్ మరోసారి ఓట్ల లెక్కింపు జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. దీంతో మళ్లీ కౌంటింగ్ నిర్వహించగా నంద్ కంటే శర్మకు 555 ఓట్లు అధికంగా వచ్చాయి.
సుప్రీంలో కౌంటింగ్- అవే 555 ఓట్లు
అప్పటికీ సంతృప్తి చెందని నంద్ ఏకంగా సుప్రీం కోర్టు తలుపు తట్టారు. దీనిపై సుమారు ఏడాదిపాటు విచారణ జరిగింది. ఇందులో భాగంగా అప్పటి న్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదాయతుల్లా నేతృత్వంలోనే బెంచ్ ఎదుట రీకౌంటింగ్‌ను చేపట్టాలని నిర్ణయించారు. దీంతో కౌంటింగ్ ప్రక్రియ కొన్నిరోజుల పాటు కొనసాగింది. ఇందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి శర్మకే ఎక్కువ బ్యాలెట్ పేపర్లు (555 ఓట్లు) పోల్ అయినట్లుగా న్యాయమూర్తి ప్రకటించారు. ఈ విధంగా దేశ చరిత్రలోనే తొలిసారి సుప్రీం కోర్టులో ఓట్ల లెక్కింపు జరిగింది.
1962 ఎన్నికలు!
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో హరియాణాలో జన్‌సంఘ్ చాలా బలమైన పార్టీగా కొనసాగుతోంది. కర్నాల్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మంది ఎమ్మెల్యేలు కూడా ఈ పార్టీ నుంచే ఉన్నారు. అంతకుముందు 1962 జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ జనసంఘ్ అభ్యర్థి రామేశ్వర్ నంద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరేంద్ర కుమార్‌పై పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలా ఎంపీగా పనిచేసిన నంద్ జనంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎంతలా అంటే నంద్‌తో పోటీ పడే నాయకుడే కాంగ్రెస్‌లో లేరు అనేవారంతా.
ఇందిరాగాంధీకే సవాల్
స్వామి రామేశ్వర్ నంద్ తనను ఎవరూ ఓడించలేరని అప్పట్లో చాలా గర్వంగా ఉండేవారట. ఆయన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనే తనపై ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారట. ఈ విషయాలను సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది రామ్ మోహన్ రాయ్ తెలిపారు. ఇక 1967 ఎన్నికల ఫలితాలను చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఈ ఓటమి జన్‌సంఘ్‌లో తీవ్ర ప్రకంపనలకు దారితీసింది. కాగా, ఈ విజయంపై కాంగ్రెస్ కూడా అప్పట్లో నమ్మకం పెట్టుకోలేదట.