Currency Notes In Rajya Sabha 2024 : రాజ్యసభలో కరెన్సీ నోట్లు రాజకీయ కలకలం రేపాయి. గురువారం కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ కుర్చీ వద్ద రూ.500 నోట్ల కట్టను గుర్తించారు. దీనిపై బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కరెన్సీ నోట్ల ఆరోపణలపై విచారణ జరుగుతోందని రాజ్యసభ్య ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తెలిపారు. ఆ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద కరెన్సీ నోట్ల కట్టను గుర్తించినట్లు ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ శుక్రవారం సభలో ప్రకటించారు. దీంతో రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రాజ్యసభలో నోట్ల ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఛైర్మన్ ప్రకటనతో దుమారం
గురువారం రాజ్యసభను వాయిదా వేసిన తర్వాత భద్రతా అధికారులు ఛాంబర్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారని ధన్‌ఖడ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే 222వ నంబరు సీటు వద్ద ఓ నోట్ల కట్టను గుర్తించారని పేర్కొన్నారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు అని పేర్కొన్నారు. ఈ విషయం తన దృష్టికి తీసుకురాగానే దర్యాప్తునకు ఆదేశించానని వెల్లడించారు. ఈ ప్రకటన సభలో దుమారానికి దారితీసింది.
#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, " i here by inform the members that during the routine anti-sabotage check of the chamber after the adjournment of the house yesterday. apparently, a wad of currency notes was recovered by the security officials from seat number… pic.twitter.com/kN3q2pYaGL
— ANI (@ANI) December 6, 2024
ఖండించిన ఖర్గే
రూ.500, రూ.100 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్ ఖడ్ వెల్లడించారు. ఆ నోట్లు అసలైనవో, నకిలీవో స్పష్టత లేదన్నారు. ఈ విషయాన్ని సభకు చెప్పడం తన బాధ్యతని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఛైర్మన్ ప్రకటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఈ ఘటనపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన ఆయన, దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
'పేరు చెబితే తప్పేంటి?'
ఖర్గే వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుబట్టారు. 'పేరు చెబితే తప్పేంటి? ఏ సీటు వద్ద కరెన్సీ నోట్ల కట్ట దొరికిందో, అక్కడ ఎవరు కూర్చుంటారో ఛైర్మన్ చెప్పారు. అందులో సమస్య ఏముంది? ఇలా నోట్ల కట్టలను సభకు తీసుకురావడం సరికాదు. దీనిపై సీరియస్‌గా దర్యాప్తు జరగాలి' అని పేర్కొన్నారు. మరోవైపు, రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
#WATCH | Delhi: On RS Chairman statement 'a wad of currency notes recovered from the bench of Abhishek Manu Singhvi', BJP MP Manoj Tiwari says, " a bundle of notes has been recovered from the bench. this is a matter of investigation. the vice president of india has ordered an… pic.twitter.com/aX4jP8VUzS
— ANI (@ANI) December 6, 2024
సింఘ్వీ స్పందన
మరోవైపు, ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ స్పందించారు. తాను రాజ్యసభ ఛైర్మన్ ప్రకటన చూసి ఆశ్చర్యపోయానని మీడియాతో వ్యాఖ్యానించారు. భద్రతా సంస్థలలో వైఫల్యం ఉంటే దానిని పూర్తిగా బహిర్గతం చేయాలని కోరారు. 'ఇలాంటి పరిస్థితిని నేనెన్నడూ చూడలేదు. నిన్న రాజ్యసభకు వచ్చేటప్పుడు నా జేబులో కేవలం ఒక రూ.500 నోటు మాత్రమే ఉంది. నిన్న మధ్యాహ్నం 12.57 గంటలకు సభ లోపలికి వచ్చా. ఒంటి గంటకు సభ వాయిదా పడటం వల్ల క్యాంటీన్‌కు వెళ్లా. మధ్యాహ్నం 1.30 గంటలకు పార్లమెంట్ నుంచి వెళ్లిపోయా' అని సింఘ్వీ తెలిపారు.
తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం - Abhishek Singhvi elect Rajya Sabha