Uttarakhand UCC Bill Passed : వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకేతరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. భవిష్యత్‌లో ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈతరహా బిల్లులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్ ఇప్పటికే ప్రకటించింది.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదం కోసం ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. మంగళవారం ఈ బిల్లును సీఎం పుష్కర్‌సింగ్ ధామీ సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన వాటితోపాటు సహ జీవనానికి రిజిస్ట్రేషన్ వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని విపక్షాలు సూచించినా, అధికార పార్టీ మాత్రం తన పంతం నెగ్గించుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోద ముద్ర వేయడం చారిత్రక క్షణంగా వర్ణించారు ముఖ్యమంత్రి ధామి.
"రాష్ట్ర ప్రజలందరికీ నేను అభినందనలు చెబుతున్నా. 'ఒకే భారత్, మెరుగైన భారత్' కలను సాకారం చేసేందుకు ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకువస్తామని మా ప్రభుత్వం హామీ ఇచ్చింది. చెప్పినట్లు చేసింది. అయితే ఈ బిల్లుపై తమ ఆలోచనలను పంచుకున్నందుకు ప్రతిపక్ష సభ్యులతో సహా అసెంబ్లీ సభ్యులందరికీ ధన్యావాదాలు చెబుతున్నా."
-- పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ సీఎం
"రెండో సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తొలి మంత్రివర్గ సమావేశంలోనే యూనిఫాం సివిల్ కోడ్ అమలు కోసం కమిటీ ఏర్పాటు చేశాం. 2022 మే 27న రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. సరిహద్దు గ్రామమైన మనాలో ప్రారంభమైన జన్ సంవద్ యాత్ర దాదాపు తొమ్మిది నెలల తర్వాత దిల్లీలో ముగిసింది. 2.32 లక్షలకు పైగా సూచనలు అందాయి. రాష్ట్రంలోని దాదాపు 10 శాతం కుటుంబాలు బిల్లు రూపకల్పనకు తమ సూచనలను అందించాయి. యూసీసీ సాధారణ బిల్లు కాదు. అత్యద్భుతమైన బిల్లు" అని సీఎం ధామి కొనియాడారు. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లులో ఏదైనా నిబంధనను చేర్చాల్సిన అవసరం ఉన్నట్లయితే భవిష్యత్తులో సవరించవచ్చని సీఎం తెలిపారు.
కార్యకర్తల సంబరాలు-సీఎంకు సత్కారం
మరోవైపు, యూసీసీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీ వెలుపల బీజేపీ మహిళా కార్యకర్తలు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మరికొందరు కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. దెహ్రాదూన్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని పార్టీ నేతలు సత్కరించారు.
ఈ బిల్లులో అన్ని మతాలవారికి ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు అమలవుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో సహ జీవనంలో ఉండాలనుకునే వారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని, 21 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులైతే తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని బిల్లులో పేర్కొంది. సహ జీవనం చేయాలనుకునే ఇద్దరిలో ఒకరికి పెళ్లైనా, మైనర్ అయినా అనుమతించబోమని తెలిపింది.
సహ జీవనం రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ సిద్ధం చేస్తున్నట్టు వివరించింది. సహజీవనంపై తప్పుడు సమాచారం ఇస్తే మూడు నెలల జైలు, రూ.25 వేల జరిమానా, అసలు నమోదు చేయించుకోకుంటే రూ.25 వేల జరిమానా ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామని తెలిపింది. సహజీవనంలో జన్మించిన పిల్లలకు చట్టబద్దమైన హక్కులు సంక్రమిస్తాయని తెలిపింది. భాగస్వామి విడిచి పెడితే మహిళ భరణం కోరవచ్చని పేర్కొంది.
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్నట్లు 2022 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండోసారి అధికారం చేపట్టిన సీఎం ధామీ, ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రెండేళ్లు కసరత్తు చేసిన కమిటీ గత శుక్రవారం ముసాయిదా ప్రతిని సమర్పించింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేస్తే స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది.