Uttarakhand UCC Bill Draft : ఉత్తరాఖండ్ శాసనసభలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రవేశపెట్టారు. భారతీయ పౌరులు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ఆమోదం కోసమే నాలుగు రోజులపాటు ప్రత్యేక శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేశారు. సీఎం ధామి బిల్లు ప్రవేశపెట్టే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు జైశ్రీరామ్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేయగా, బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ బిల్లు ఆమోదం పొందితే స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్నట్లు 2022 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండోసారి అధికారం చేపట్టిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ, ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రెండేళ్లు కసరత్తు చేసిన కమిటీ గత శుక్రవారం ముసాయిదా ప్రతిని సమర్పించింది. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే ఉత్తరాఖండ్‌లోని అన్ని మతాలకు ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి.
సహ జీవనానికి తల్లిదండ్రుల అనుమతి
ఉమ్మడి పౌర స్మృతి బిల్లులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక అంశాలను పొందుపరిచింది. ఉత్తరాఖండ్‌లో సహ జీవనంలో ఉండాలనుకుంటున్న వారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. 21ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులు సహ జీవనంలోకి చేయాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని బిల్లులో స్పష్టం చేశారు. అయితే నైతికతకు విరుద్దంగా ఉన్న సహజీవనాలను రిజిస్టర్ చేయడం కుదరదని కూడా ఉమ్మడి పౌర స్మృతి బిల్లులో స్పష్టం చేశారు. సహ జీవనం చేయాలనుకున్న ఇద్దరిలో ఒకరికి వివాహం జరిగినా, మైనర్ అయినా సహ జీవనం సంబంధాలు రిజిస్టర్ చేయబోరని స్పష్టం చేసింది.
సహ జీవనం రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్
సహ జీవనం రిజిస్ట్రేషన్ కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్ సిద్ధం చేస్తోందని ఇది జిల్లా రిజిస్ట్రార్‌కు లివ్ ఇన్ రిలేషన్ రిజిస్ట్రేషన్ బాధ్యతను అప్పగిస్తారని ఓ అధికారి తెలిపారు. ఆన్‌లైన్‌లో సహ జీవనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, కానీ రిజిస్ట్రార్ అవసరమనుకుంటే ఇద్దరినీ కార్యాలయానికి పిలిచి విచారించవచ్చని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు. ఒకవేళ సహ జీవనం రిజిస్టర్‌ను నిరాకరిస్తే దానికి గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు.
తప్పుడు సమాచారం ఇస్తే జరిమానా, జైలుశిక్ష
సహజీవనం దరఖాస్తులో ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే రిజిస్ట్రార్ పోలీసు విచారణ కూడా కోరవచ్చని ఈ బిల్లులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. సహజీవనం గురించి తప్పుడు సమాచారం ఇస్తే మూడు నెలల జైలు, రూ. 25 వేల జరిమానా విధిస్తారు. సహ జీవనాన్ని రిజిస్టర్ చేయించకపోతే రూ. 25 వేల జరిమానా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. సహజీవనంలో జన్మించిన పిల్లలకు చట్టబద్దమైన హక్కులు సంక్రమిస్తాయి.
ఇస్లాం పద్ధతులపై నిషేధం
తల్లిదండ్రుల ఆస్తులతో అన్ని సమానంగా ఉంటాయి. సహ జీవనంలో భాగస్వామి విడిచి పెడితే ఆ మహిళ, భరణం కోరవచ్చని బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లులో బహు భార్యత్వం, బాల్య వివాహాలపై పూర్తి నిషేధం, అన్ని మతాలలోని బాలికలకు ప్రామాణిక వివాహ వయస్సు విడాకుల కోసం ఏకరీతి ప్రక్రియ వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. విడాకులు, భర్త మరణం తర్వాత ఇస్లాం మహిళలు తప్పకుండా పాటించాల్సిన హలాలా, ఇద్దత్ వంటి పద్ధతులపై నిషేధాన్ని కూడా ఈ బిల్లులో చేర్చారు.