Friendship Between Sadhu And Bears : ఛత్తీస్‌గఢ్‌లో ఓ సన్యాసి, ఎలుగుబంట్ల మధ్య స్నేహం ఏర్పడింది! ఈ క్రమంలో ఎలుగుబంట్ల ఆలనాపాలనను సన్యాసి చూసుకుంటున్నారు. వాటికి ఆహారం, నీరుని అందిస్తున్నారు. అలాగే ముద్దుపేర్లను పెట్టి పిలుస్తూ వాటిని మనుషుల్లానే ఆదరిస్తున్నారు.
కన్నబిడ్డల్లా సాకుతూ!
2013లో సీతారాం అనే సన్యాసి మధ్యప్రదేశ్‌లోని షహదోల్ నుంచి మనేంద్రగఢ్ చిర్మిర్ భరత్‌పుర్ జిల్లాకు వచ్చారు. అక్కడే ఓ చిన్న గుడిసెను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఎలుగుబంటితో స్నేహం చేయడం ప్రారంభించారు. దానికి రామ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఎలుగుబంటి కుటుంబం పెరుగుతూ వచ్చింది. మొత్తం తల్లిపిల్లలతో కలిసి ప్రస్తుతం 7 ఉన్నాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం పేర్లు
ఈ ఏడు ఎలుగుబంట్లకు హిందూ ఆచారం ప్రకారం లల్లి, మున్ను, చన్ను, గుల్లు, సోను, మోను, సత్తానంద్ అని పేర్లు పెట్టారు సీతారాం. రోజు తన దగ్గరకు వచ్చిన ఎలుగుబంట్లకు ఆహారం, నీరు పెడుతున్నారు. వాటిని సొంత బిడ్డల్లా సాకుతున్నారు. ఈ మూగజీవాలు తన వద్దకు వచ్చే భక్తులను ఎలాంటి హాని చేయవని చెబుతున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
ఎలుగుబంట్లన్నీ 200 మీటర్ల పొడవున్న రాజమడ అనే గుహలో నివసిస్తున్నాయి. ఇందులో మొత్తం నాలుగు గదులు ఉన్నాయి. ఈ గుహ ఒకప్పుడు భరత్‌పుర్ రాజు విశ్రాంతి స్థలం. రాజు ఈ గుహను యుద్ధ సమయంలో సురక్షితమైన ప్రదేశంగా ఉపయోగించుకునేవారు. ప్రస్తుతం ఈ గుహలో ఎలుగుబంట్లు నివసిస్తున్నాయి. రాజు తన బస కోసం ఈ గుహను నిర్మించారు. అలాగే రాజమడలో ఆయుధాలు కూడా ఉన్నాయని గ్రామస్థుడు గణేశ్ తివారీ చెప్పారు.
భారీగా తరలివస్తున్న భక్తులు
ఎలుగుబంట్లతో సన్యాసి సీతారాం స్నేహం చేయడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మనిషికి, జంతువులకు స్నేహం ఎలా కుదిరిందని ఆలోచిస్తున్నారు. ప్రపంచంలో తనకు ఎవరూ లేరని, ఎలుగుబంట్లనే కుటుంబసభ్యుల్లా భావిస్తానని సన్యాసి సీతారాం చెప్పారు. అందుకే వాటితో స్నేహం చేశానని పేర్కొన్నారు. కాగా, ఎలుగుబంట్లను చూసేందుకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను ప్రజలు భరత్ పుర్‌కు భారీగా తరలివస్తున్నారు.