UGC On Fake Degree Certificate : ఆన్‌లైన్‌లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విద్యార్థులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థుల్ని ఆకట్టుకొనేందుకు 'పది రోజుల్లోనే ఎంబీఏ' వంటి కోర్సుల పేర్లతో ప్రచారం చేస్తున్న వారిపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించింది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపు పొందిన డిగ్రీ ప్రోగ్రామ్‌ల మాదిరిగానే సంక్షిప్త పదాలతో ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు, కోర్సులను అందిస్తామంటూ కొన్ని సంస్థలు, వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి వాటిలో ముఖ్యంగా '10 రోజుల MBA' అంశం తమ దృష్టికి వచ్చినట్లు యూజీసీ కార్యదర్శి మనీష్ జోషీ చెప్పారు.
కేంద్ర చట్టం లేదా రాష్ట్ర, ప్రాంతీయ చట్టం ద్వారా ఏర్పాటైన లేదా విలీనమైన విశ్వవిద్యాలయం, డీమ్డ్ ఇన్‌స్టిట్యూట్ లేదా పార్లమెంటు చట్టం ద్వారా ప్రత్యేక అధికారం పొందిన సంస్థలకు మాత్రమే డిగ్రీని ప్రదానం చేసే అధికారం ఉంటుందని మనీష్ జోషీ క్లారిటీ ఇచ్చారు. ఉన్నత విద్యాసంస్థలు ఏదైనా ఆన్‌లైన్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందించాలనుకుంటే UGC అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లను అందించేందుకు అనుమతి పొందిన ఉన్నత విద్యాసంస్థలు, ఆయా సంస్థల్లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ల జాబితా deb.ugc.ac.inలో చూసుకోవచ్చని తెలిపారు. అందువల్ల ఆన్‌లైన్ కోర్సులకు దరఖాస్తులు/అడ్మిషన్లకు ముందు అవి చెల్లుబాటయ్యేవో, కాదో నిర్ధరించుకోవాలని ఈసందర్భంగా విద్యార్థులకు తెలిపారు.
వారికి కూడా వార్నింగ్
అంతకుముందు కొన్ని నెలల క్రితం సైతం విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులను అందిస్తున్న ఎడ్‌టెక్ కంపెనీలు, కళాశాలలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) హెచ్చరించింది. వీటికి కమిషన్ గుర్తింపు ఇవ్వబోదని స్పష్టం చేసింది. విద్యార్థులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. 'అనేక ఉన్నత విద్యా సంస్థలు, కాలేజీలు కమిషన్ చేత గుర్తింపులేని మధ్యవర్తుల సహకారం ద్వారా విదేశీ సంస్థలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇలాంటి వారి చర్యలకు యూజీసీ ఆమోదం లేదు. వీరు విద్యార్థులకు ఇచ్చే డిగ్రీలు చట్టరీత్యా చెల్లుబాటు కావు' అని యూజీసీ కార్యదర్శి మనీశ్ జోషి వెల్లడించారు. కొన్ని ఎడ్‌టెక్ కంపెనీలు విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లతో కలిసి డిగ్రీ, డిప్లొమా కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తామంటూ వార్తాపత్రికలు, సోషల్‌మీడియా, టెలివిజన్‌లలో ప్రకటనలు ఇస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు.