Uattar Pradesh Loksabha Election 2024 : కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో గెలవాలి! ఇదీ దశాబ్దాలుగా సాగుతున్న సిద్ధాంతం. మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలిస్తే వారి దిల్లీ పీఠాన్ని అధిష్ఠిస్తారన్నది కాదనలేని వాస్తవం. అయితే ఈసారి కొత్త పొత్తులు, విపక్ష ఇండియా కూటమికి ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ-బహుజన్ సమాజ్ పార్టీల కూటమి, NDA కూటమిని కాస్త ప్రతిఘటించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో కొన్ని లోక్‌సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ హవాను కొంత మేర అడ్డుకోగలిగింది.
2019 ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో మినహా ఎస్పీ-బీఎస్పీ కూటమి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈసారి బీఎస్పీ అధినేత్రి మాయావతి లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసే వచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. NDA కూటమిని బలంగా అడ్డుకునేందుకు కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి బదులుగా ఇప్పుడు ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు విపక్ష ఇండియా కూటమికి ఆశ్చర్యకరమైన ఫలితాలను అందించవచ్చు.
గత ఎన్నికల్లోనూ ఎన్డీఏదే హవా
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో 73 స్థానాలను బీజేపీ దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 64 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో 62 ఎంపీ స్థానాలను బీజేపీ ఒంటరిగా గెలుచుకోగా ఎన్డీఏలో భాగస్వామి అయిన అప్నాదళ్ రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ 10 స్థానాలు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 5 స్థానాలు కైవసం చేసుకుంది. పూర్తి వ్యతిరేకత ఉందన్న వార్తలు వచ్చినా సరే 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 62 స్థానాలను గెలుచుకుని ఉత్తరప్రదేశ్‌లో తాము ఎంత బలంగా ఉన్నామో చాటిచెప్పింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పశ్చిమ నియోజకవర్గాల్లో బీజేపీకి 23 సీట్లు రాగా, ఎస్పీ-బీఎస్పీ కూటమికి నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి. పశ్చిమ యూపీలోని సహరాన్‌పుర్, బిజ్నోర్, అమ్రోహా, నగీనా సీట్లను బీఎస్పీ గెలుచుకుంది. సంభాల్, మొరాదాబాద్, మెయిన్‌పురి, రాంపుర్‌లలో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాయ్‌బరేలీ స్థానాన్ని నిలబెట్టుకోగా, అమేఠీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. లఖ్‌నవూ నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజయం సాధించారు. పశ్చిమ ప్రాంతంలో అంబేద్కర్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గాన్నిమాత్రమే బీఎస్పీ గెలుచుకుంది.
యూపీలోని తూర్పు నియోజకవర్గాల్లో మొత్తం 30 ఎంపీ స్థానాలు ఉండగా ప్రధాని మోదీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కూడా అందులో ఒకటి. 2019 ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి బీఎస్పీ ఐదు స్థానాల్లో గెలుపొందగా, ఎస్పీ ఒకటి గెలుచుకుంది. అప్నాదళ్ ఇక్కడి నుంచే రెండు సీట్లు గెలుచుకుంది. ఇక్కడ బీజేపీ ఈసారి మరింత బలంగా ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. యూపీలోని వివిధ ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్‌వేలు, కొత్త విమానాశ్రయాలు రావడం ప్రాంతీయ అసమానతను తగ్గించాయి. ఈ క్రమంలో ఎస్పీ-కాంగ్రెస్ మధ్య పొత్తు ఎంతవరకు ఫలప్రదం అవుతుందో చూడాలి.
బిహార్‌లో NDA సీట్ల పంపకం పూర్తి- మెజారిటీ స్థానాల్లో బీజేపీ పోటీ- ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
తిరువనంతపురంలో టఫ్ ఫైట్! విజయంపై థరూర్ ధీమా! కేరళలో జెండా పాతేందుకు బీజేపీ రె'ఢీ'