TTD Cancels VIP Break Darshan on Deepavali : తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు.. ప్రతిరోజు వేలాది మంది భక్తులు కొండపైకి తరలివస్తుంటారు. పండగలు, ఉత్సవాల సమయంలో స్వామి సన్నిధిలో గడపాలని చాలా మంది కోరుకుంటారు. మరి.. మీరు కూడా దీపావళి రోజున స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లాలనుకుంటే.. ఈ విషయం తెలుసుకోండి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. దీపావళి రోజున దర్శనాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీన దీపావళి సందర్భంగా శ్రీవారి ఆలయంలో 'దీపావళి ఆస్థానం' నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ప్రొటోకాల్ దర్శనం మినహా.. మిగిలిన బ్రేక్ దర్శనాలన్నీ రద్దు చేసినట్లు వెల్లడించింది. అదేవిధంగా.. అక్టోబర్ 30న బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ సూచించింది.
దీపావళి రోజున స్వామికి వారికి నిర్వహించే ప్రత్యేక పూజ కార్యక్రమాలు : దీపావళి రోజున తిరుమలలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయం బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. మొదటగా ఘంటా మండపంలో.. సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనులవారిని కూడా శ్రీవారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను నిర్వహించడంతో దీపావళి ఆస్థానం ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనం ఇస్తారు.
ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ : తిరుమలలో దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 31న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసినట్లు చెప్పింది. అలాగే తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారని ప్రకటించింది. కాబట్టి, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.
ఇవి కూడా చదవండి :
ఆర్థిక సమస్యలను తొలగించే 'రమా' ఏకాదశి - ఇలా చేస్తే సిరి సంపదలు మీ సొంతం!
ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కడుతున్నారా? - ఈ రోజుల్లో కడితేనే విశేష ఫలితాలు!