Lok Sabha Candidate With Zero Account Balance : ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు. ధన బలం, అంగ బలం ఉండి తీరాల్సిందే. ఇవి ఉంటేనే అన్ని వర్గాల ప్రముఖులను ప్రభావితం చేసి ఓట్లు వేయించుకోగలుగుతారు. రాజకీయాల్లో ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న ప్రస్తుత తరుణంలోనూ ఓ మహిళా మణి సాహసం చేశారు. బ్యాంకు అకౌంటులో జీరో బ్యాలెన్సు కలిగిన 33 ఏళ్ల శాంతిబాయి మారావీ ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి సంచలనం క్రియేట్ చేశారు. కనీసం ఆమెకు పాన్ కార్డు నంబరు కూడా లేదు. ఒక్క సోషల్ మీడియా యాప్‌లోనూ అకౌంటు లేదు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కోటీశ్వరులు. ఈ శ్రీమంతులను శాంతిబాయి మారావి ఎలా ఢీకొంటారు ? రసవత్తరంగా మారిన కోర్బా లోక్‌సభ పోల్‌పై ప్రత్యేక కథనం.
ఐదోతరగతి పాస్
కోర్బా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జ్యోత్స్నా మహంత్, బీజేపీ నుంచి సరోజ్ పాండే పోటీ చేస్తున్నారు. వీరిద్దరికీ కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. కోర్బా లోక్‌సభ స్థానం పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన మార్వాహి అసెంబ్లీకి చెందిన సాధారణ గిరిజన మహిళ శాంతిబాయి మారావీ. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
శాంతి బ్యాంకు అకౌంటులో బ్యాలెన్స్ లేదు. చేతిలో కేవలం రూ.20 వేల నగదు ఉంది. ఇంత తక్కువ డబ్బుతో ఆమె కోటీశ్వరులైన అభ్యర్థులను ఢీకొనబోతున్నారు. మార్వాహి అసెంబ్లీ స్థానం పరిధిలోని గౌరెల పెండ్రా మండలంలోని బెద్రపాని గ్రామానికి చెందిన శాంతి ఐదో తరగతి పాసయ్యారు. ఆమె వ్యవసాయ కూలీ. ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. కూలీ పనులు, వ్యవసాయం చేయగా వచ్చే ఆదాయంతోనే శాంతిబాయి మారావీ కుటుంబం గడుస్తోంది.
10 గ్రాముల బంగారం మాత్రమే
బ్యాంక్ ఆఫ్ బరోడా పెండ్రా బ్రాంచ్‌లో శాంతి పేరు మీద బ్యాంకు అకౌంట్ ఉంది. అయితే అందులో ఒక్క రూపాయి కూడా లేదు. అయితే ఆమెకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో రెండు వేల రూపాయలు ఉన్నాయి. కేవలం 10 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి మాత్రమే శాంతికి ఉంది. నేటికాలంలో ఎన్నికల వేళ ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా అకౌంట్లు అత్యవసరం.
అయితే శాంతికి ఒక్క సోషల్ మీడియా అకౌంటు కూడా లేదు. కనీసం ఇప్పటిదాకా ఆమె పాన్ కోర్డు కోసం అప్లై చేసుకోలేదు. ఏం జరిగిందో ఏమో నామినేషన్ దాఖలు చేసి వచ్చినప్పటి నుంచి శాంతి ఫోన్ నంబరు స్విచ్ఛాఫ్ మోడ్‌లోనే ఉండటంపై అంతటా చర్చ జరుగుతోంది. కనీసం ఫోన్ ఆన్‌లో లేకుంటే శాంతి తన సందేశాన్ని ప్రజలకు ఎలా తెలియజేస్తారు అనే దానిపై చర్చ నడుస్తోంది. కాగా, కోర్బా లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి జ్యోత్స్నా మహంత్ ఆస్తుల విలువ రూ.9.17 కోట్లు. జ్యోత్స్నా మహంత్ భర్త చరణ్ దాస్ మహంత్‌కు కూడా రూ.8.79 కోట్ల ఆస్తులు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి సరోజ్ ఆస్తులు రూ.2.87 కోట్లు.
ఎన్నికల వేళ మమతకు మరో గాయం- హెలికాప్టర్ సీటులో కూర్చుంటూ! - Mamata Banerjee Injured