Tirumala Special Darshan Tickets for April 2024 Released: తిరుమల కొండపై కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని కనులారా వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తిరుపతికి తరలివస్తారు. కాలినడక ద్వారా స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పలు సేవలు ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల: ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో బుధవారం(జనవరి 24) ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విడుదల చేసింది. అలాగే తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఇక శ్రీవారి సేవ కోటాను జనవరి 27న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. అలాగే నవనీత సేవ కోటాను అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఒకవేళ మీరు ఏప్రిల్లో తిరుమల వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి: ఇదిలా ఉంటే.. తిరుమలలో రేపు (జనవరి 25న) శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి జరగనుంది. ఇందుకోసం గురువారం రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్నారు. అదే రోజు.. పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ కూడా ఉంటుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. అయితే... శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి కార్యక్రమానికి సంబంధించి భక్తులకు టీటీడీ అధికారులు ముఖ్య గమనిక చేశారు. ఈ కార్యక్రమానికి 10 సంవత్సరాలలోపు పిల్లలు, 50 సంవత్సరాలు దాటిన వృద్ధులతో పాటు.. ఊబకాయం, శస్త్రచికిత్సలు చేయించుకున్న భక్తులను అనుమతించబోమని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.