Terrorist Attack On Indian Army : లోక్‌సభ ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలోని శశిధర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంతోపాటు మరో దానిపైనా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు జవాన్లు గాయపడినట్లు అధికారులు చెప్పారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. అనంతరం ఉద్ధంపూర్‌లోని ఆస్పత్రికి విమానంలో తరలించారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. సమీపంలోని అటవీప్రాంతంలోకి పారిపోయిన ఉగ్రవాదులను గుర్తించేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు. గత ఏడాది సైన్యంపై వరుస ఉగ్రదాడులు జరిగిన ఈ ప్రాంతంలో ఈ ఏడాదిలో ఇదే మొదటి అతిపెద్ద దాడి అని తెలిపారు. ఇదిలా ఉండగా పూంచ్ ప్రాంతం అనంతనాగ్- రాజౌరీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆరో విడతలో భాగంగా మే 25న ఇక్కడ పోలింగ్ జరగనుంది.
-
J&K | Indian Air Force vehicles that came under attack by terrorists in Poonch sector today. Treatment of injured IAF personnel going on in the Command Hospital, Udhampur: Security Forces' officials pic.twitter.com/JwnlpWnMWE
— ANI (@ANI) May 4, 2024
యువకులను చంపిన ఉగ్రవాదులు
అంతకుముందు కొన్ని రోజుల క్రితం శ్రీనగర్‌లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కార్మికులు చనిపోయారు. ఒకరు ఘటనాస్థలంలోని మృతిచెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు చెప్పారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదులు ఈ ఏడాది టార్గెట్ చేసిన చంపిన తొలి ఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన వారిని పంజాబ్‌లోని అమృత్ సర్‌కు చెందిన అమృత్‌పాల్ సింగ్, రోహిత్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువకులిద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులు.
నమాజ్ చేస్తున్న రిటైర్డ్ పోలీస్ అధికారి హత్య
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. బారాముల్లాలోని గంట్‌ముల్లాలో ఓ విశ్రాంత పోలీసు అధికారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. విశ్రాంత అధికారిని మహ్మద్ షఫీగా అధికారులు గుర్తించారు. స్థానిక మసీదులో ప్రార్థన కోసం వెళ్లిన క్రమంలో ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపినట్టు పోలీసులు చెప్పారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.