How To Make Perfect Upma Recipe : చాలా మంది ఉప్మా అనగానే ముఖం తిప్పుకుంటారు. ముఖ్యంగా పిల్లలైతే బ్రేక్‌ఫాస్ట్‌లో ఉప్మా అంటే అస్సలు తినడానికి ఇష్టపడరు. మీ పిల్లలు కూడా ఉప్మా(Upma) తినడానికి ఇష్టపడట్లేదా? అయితే.. ఓసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దల వరకు వద్దన్న వాళ్లు కూడా ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు! ఇంతకీ, ఆ సూపర్ టేస్టీ ఉప్మాకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బొంబాయి రవ్వ - పావుకిలో
- జీలకర్ర - ఒక టీస్పూన్
- నూనె - పావు కప్పు
- ఆవాలు - 1 టీస్పూన్
- మినపప్పు - 2 టీస్పూన్లు
- శనగపప్పు - 2 టీస్పూన్లు
- జీడిపప్పు - 10 నుంచి 15
- కరివేపాకు - 2 రెమ్మలు
- అల్లం తరుగు - 1 టేబుల్‌స్పూన్(సన్నగా కట్ చేసుకోవాలి)
- పచ్చిమిర్చి - 3(సన్నగా తరుక్కోవాలి)
- నెయ్యి - పావు కప్పు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టౌపై కాస్త మందంగా ఉన్న పాన్ పెట్టుకొని బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఆపై మంటను లో-ఫ్లేమ్‌లో ఉంచి రవ్వ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో ఒక టీస్ఫూన్ జీలకర్ర వేసి మరికాసేపు వేయించుకోవాలి. ఇలా రవ్వలో జీలకర్ర వేసి వేయించుకోవడం వల్ల ఉప్మాకు మంచి టేస్ట్ వస్తుంది. రవ్వ బాగా వేగిందనుకున్నాక ఆ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో పావు కప్పు నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి బాగా వేపుకోవాలి.
- అనంతరం తాలింపు ఘుమఘుమలాడిపోతున్నప్పుడు జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు ఒక్కొక్కటిగా వేసుకొని ఆ మిశ్రమాన్ని మరికాసేపు వేయించుకోవాలి.
- అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. జీడిపప్పు మరీ ఎక్కువగా వేగకుండా కాస్త మగ్గితే సరిపోతుంది.
- ఆ విధంగా మిశ్రమాన్ని వేగించుకున్నాక.. అందులో మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే.. మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ పోసుకోవాలనే విషాయాన్ని గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు పాలు కూడా ఆ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత పాలు మరిగేలోపు ముందుగా వేయించుకొని పెట్టుకున్న రవ్వలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల జీడిపప్పు మిశ్రమంలో రవ్వ వేయగానే పాలు విరగకుండా ఉంటాయి.
- ఇక పాలు మరిగాయనుకున్నాక.. రవ్వను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గడ్డ కట్టకుండా కలుపుకోవాలి.
- అలా కలిపేటప్పుడు మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి రెండు నిమిషాల పాటు మిశ్రమాన్ని కలుపుకునేలా చూసుకోండి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి పాన్ దించుకొని 5 నిమిషాలు అలా వదిలేయండి. ఆ వేడికి రవ్వ చాలా చక్కగా మగ్గిపోతుంది.
- 5 నిమిషాలయ్యాక చివరగా అందులో పావుకప్పు నెయ్యి వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంతే.. మీరు ఇప్పటి వరకు టేస్ట్ చేయని ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ!
ఇవీ చదవండి :
ఆశ్చర్యం : నూనె లేకుండా పూరీలు చేసుకోవచ్చు - ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ - ఎంతో టేస్టీగా ఉంటాయి!
హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ - ప్రిపరేషన్ వెరీ ఈజీ- పల్లీ చట్నీతో తింటే టేస్ట్ వేరే లెవల్!