NEET Exam Reforms : ఎన్‌టీఏ 2025 పరీక్షల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఎన్‌టీఏ 2025 నుంచి ఉన్నత విద్యా సంస్థలకు ప్రవేశ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించదని ఆయన స్పష్టం చేశారు.
నీట్ ఎగ్జామ్
వచ్చే ఏడాది నుంచి నీట్-యూజీ పరీక్షను పెన్-పేపర్ విధానంలో నిర్వహించాలా లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించాలా అనే అంశంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చిస్తున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భవిష్యత్‌లో కంప్యూటర్ అడాప్టివ్ టెస్ట్, టెక్ ఆధారిత ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా 2025లో పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. కొత్తగా 10 పోస్టులు సృష్టిస్తామని తెలిపారు.
ఎన్‌టీఏ - ఎంట్రన్స్ పరీక్షలకే పరిమితం!
"ఎన్‌టీఏ కేవలం ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్ పరీక్షల నిర్వహణకే పరిమితం అవుతుంది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించబోదు. కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-యూజీని ఏడాదికి ఒకసారి నిర్వహిస్తాం. జీరో ఎర్రర్ టెస్టింగ్ ఉందని నిర్ధరించడానికి ఎన్‌టీఏ పనితీరులో అనేక మార్పులు ఉంటాయి" అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi | Union Education Minister Dharmendra Pradhan says, " in the next academic year, ncert will publish 15 crore quality and affordable books... there will be no financial burden on students in the next academic year, rather it will be reduced in some classes... ncert… pic.twitter.com/v5HUs1sJ3N
— ANI (@ANI) December 17, 2024
ఈ ఏడాది నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం, ఇతర అవాంతరాల కారణంగా పలు పరీక్షలు రద్దవ్వడం వల్ల ఎన్‌టీఏను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయి ప్యానెల్ సిఫార్సు మేరకు తాజాగా సంస్కరణలు తీసుకొచ్చింది. ఎన్‌టీఏను కేవలం ప్రవేశ పరీక్షల నిర్వహణకే పరిమితం చేసింది.