Kolkata Doctor Case : బంగాల్లోని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న హత్యాచార కేసును విచారించనుంది. ఈనెల 9న కోల్‌కతాలోని RG కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అప్రమత్తమైన బంగాల్ పోలీసులు
కోల్‌కతా హత్యాచార ఘటనపై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుండటంపై బంగాల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం కావటమే ఆందోళనలకు కారణమని భావిస్తున్న పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ లాకెట్ ఛటర్జీతోపాటు ఇద్దరు వైద్యులు కునాల్ సర్కార్, సుబర్నోగోస్వామికి సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని సూచించారు.
అనేక ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన డాక్టర్ గోస్వామి పోస్టుమార్టం నివేదికను చూసినట్లు చెప్పారు. అందులో విస్తుపోయే నిజాలు ఉన్నాయని తెలిపారు. మృతురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యంతోపాటు కటి ఎముక విరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో ఉందన్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ముమ్మాటికి మృతురాలిపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని డాక్టర్ గోస్వామి తెలిపారు. ఈ విషయాలను కోల్‌కతా పోలీసులు తోసిపుచ్చారు.
ఆ విషయాలేం లేవ్!
పోస్టుమార్టం నివేదికలో అలాంటి విషయాలేమీ లేవన్నారు పోలీసులు. ఇలాంటి అసత్యాలన్నీ సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం కావటం వల్ల ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. అలాంటి ప్రచారాలు నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవన్నారు. మృతురాలి పేరు, ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకు బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. పోలీస్ సమన్లపై స్పందించిన ఆమె, బాధితురాలికి న్యాయం చేయడంకంటే ప్రతిపక్ష నేతలు, ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఏం పోస్టులు పెడుతున్నారో చూడటానికే పోలీసులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.
#WATCH | West Bengal: Protest held near Salt Lake stadium in Kolkata against the rape and murder of a woman resident doctor in RG Kar Medical College and Hospital. pic.twitter.com/Uu8P5omlJg
— ANI (@ANI) August 18, 2024
అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు
కోల్‌కతా హత్యాచార ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ, ఆయా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా నివేదిక పంపాలని సూచించింది. వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగు చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ పేర్కొంది.