Sonika Broom Business Story In Meerut : ప్రస్తుత కాలంలో వ్యాపార రంగంలో పురుషుల కంటే తామేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు మహిళలు. ఇలానే చీపుర్ల వ్యాపారంలో రూ.25 వేల పెట్టుబడి పెట్టి ఏడాదిన్నర వ్యవధిలో రూ.12 లక్షల టర్నోవర్‌కు వ్యాపారాన్ని విస్తరించింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన సోనిక. ఈ వ్యాపారంలోకి సోనిక తన భర్తను కూడా తీసుకొచ్చింది. అలాగే తన గ్రామంలోని కొందరు మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. మరి వ్యాపారంలో సోనిక ఎదిగిన తీరు, ఆమె విజయగాథను తెలుసుకుందాం.
మేరఠ్‌లోని రాలీ చౌహాన్ గ్రామానికి చెందిన సోనిక కుటుంబం ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే. సోనిక భర్త సోనూ కుమార్ పెయింటర్. అతడి ఆదాయం చాలా తక్కువగా ఉండేది. అతడు పనికి వెళ్తేనే ఇళ్లు గడిచేది. లేదంటే తిండికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇంతటి ఇబ్బందికర పరిస్థితులను చూసిన సోనిక, కుటుంబం కోసం ఏదైనా చేయాలనుకుంది. ఆ సమయంలో మేరఠ్‌లో స్వయం ఉపాధి పనులకు శిక్షణ ఇస్తున్నట్లు సోనికకు తెలిసింది. వెంటనే అక్కడకు వెళ్లి చీపుర్లు తయారీ నేర్చుకుంది. ఆ తర్వాత రూ. 25వేలు పెట్టుబడి పెట్టి చీపుర్ల తయారీకి కావాల్సిన సామగ్రిని తెప్పించింది. సోనిక కుటుంబం అంతా కలిసి ఇంట్లోనే చీపుర్లను తయారుచేశారు. వాటిని మార్కెట్లలోకి తీసుకెళ్లి అమ్మడం ప్రారంభించారు.
"దుకాణదారులకు మేము తయారుచేసిన చీపుర్లు బాగా నచ్చాయి. దీంతో వారి నుంచి ఆర్డర్లు పెరిగాయి. వెంటనే నా భర్త సోనూ కుమార్‌ను ఇదే వ్యాపారంలోకి దించాను. నా భర్త ప్రస్తుతం చీపుర్ల వ్యాపారం మార్కెటింగ్‌ను చూసుకుంటున్నారు. మేం చీపుర్లను తయారుచేయడం చూసి చాలా మంది నవ్వుకునేవారు. వారు మమ్మల్ని ఎగతాళి చేసినా అవేవీ పట్టించుకోకుండా మా పనిని కొనసాగించాం. ప్రస్తుతం లారీల కొద్ది చీపుర్లు అమ్ముతున్నాం. దిల్లీకి చీపుర్లను పంపిస్తున్నాం. మా గ్రామంలోని నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం. అన్నీ ఖర్చులు పోనూ నెలకు రూ.50 వేలు మిగులుతోంది. శిక్షణ పొందిన మహిళలకైతే రోజుకు రూ.800- 1000 కూలీ ఇస్తున్నాం. శిక్షణ పొందని మహిళలకు రోజుకు రూ.400 ఇస్తున్నాం."
-సోనిక, చీపుర్ల వ్యాపారి
'కొందరు చిన్నచూపు చూశారు'
అద్దకం, పెయింటింగ్ పనులు పండగల సమయంలో మాత్రం ఉండేవని సోనిక భర్త సోనూ కుమార్ చెబుతున్నారు. సమాజంలోని కొందరు తమను చాలా చిన్నచూపు చూశారని తెలిపారు. కానీ తన భార్య, తాను అవేమీ పట్టించుకోలేదని సోనూకుమార్ పేర్కొన్నారు. మరోవైపు, సోనికకు ఏదైనా చేయాలనే తపన ఉందని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ కోఆర్డినేటర్ మాధురి చెప్పారు. ఈ ఏడాదిలో మేరఠ్ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు చీపుర్ల తయారీని సోనిక నేర్పిస్తారని తెలిపారు.