Sabarimala Darshan New Rule 2024 : శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్. అయ్యప్ప దర్శనం కోసం పులిమేడు, ఎరుమేలి అటవీ మార్గాల్లో కాలినడకన వెళ్లే యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. అటవీ మార్గంలో అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తులకు ఫారెస్ట్ అధికారుల సహకారంతో ప్రత్యేక ట్యాగ్‌ను అందజేస్తామని పేర్కొన్నారు.
'వారికి ప్రత్యేక ఏర్పాట్లు'
"పంపా నుంచి స్వామి అయ్యప్పన్ రోడ్డు మీదుగా సన్నిధానానికి భక్తులు చేరుకుంటారు. నీలిమల మార్గంలో అయ్యప్ప దర్శనానికి వెళ్లేవారికి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాం. మరక్కూట్టం వద్ద ప్రత్యేక ట్యాగ్లు కలిగిన యాత్రికులు శరంకుతి మార్గం నుంచి కాకుండా నేరుగా చంద్రానందన్ రోడ్డు ద్వారా సన్నిధానంలోకి ప్రవేశించవచ్చు. పులిమేడు, ఎరుమేలి మీదుగా నిర్దేశిత అటవీ మార్గాల ద్వారా వచ్చే భక్తులకు ప్రత్యేక ట్యాగ్‌లను అందిస్తాం. ఆలయం వద్ద ఉన్న ప్రత్యేక క్యూలో ఈ ట్యాగ్‌ను ఉపయోగించవచ్చు. అటవీ మార్గం గుండా అయ్యప్ప దర్శనం కోసం వచ్చే యాత్రికులకు ప్రత్యేక ట్యాగ్‌లను జారీ చేసే బాధ్యత అటవీ శాఖదే" అని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
అయ్యప్పను దర్శించుకున్న తమిళనాడు మంత్రి
తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు సోమవారం శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. ఈ క్రమంలో అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేశారు. మండలం- మకరవిళక్కు ఉత్సవాల సందర్భంగా శబరిమల సన్నిధానంలో చేసిన ఏర్పాట్లను శేఖర్ బాబు కొనియాడారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనానికి అవి సరిపోతాయని వ్యాఖ్యానించారు. భక్తులకు కేరళ సర్కార్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కల్పిస్తున్న సౌకర్యాలు అభినందనీయమని తెలిపారు.
దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి పలు రాష్ట్రాల నుంచి మండల పూజలు, మకరజ్యోతి సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆ సమయంలో ప్రతిరోజూ 1,20,000 మందికి పైగా భక్తులు శబరిమలకు చేరుకుంటారని అంచనా. మండల పూజలు సందర్భంగా నవంబర్ 16న తెరుచుకున్న అయ్యప్ప ఆలయం, మకరజ్యోతి తర్వాత మూసివేస్తారు.