Pregnant Woman Write Group-2 Exam : నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష జరుగుతున్న కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎలాగైన ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఓ నిండు గర్భిణీ గ్రూప్-2 పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి అనే గర్భిణీ నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రూప్-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు.
డెలివరీ డేట్ ట్విస్ట్ : ఆదివారం (డిసెంబరు 15న) గ్రూప్-2 మొదటి పేపర్ పూర్తి కాగా సోమవారం (డిసెంబరు 16) ఈరోజు గ్రూప్-2 ఉదయం పేపర్-3 పరీక్ష రాస్తున్న సమయంలోనే ఆమెకు మెల్లగా పురిటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన పరీక్ష నిర్వహణ అధికారులు రేవతిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. పరీక్ష రాస్తానని గట్టిగా చెప్పారు. రేవతి డెలివరీ తేదీ ఇవాళే కావడంతో పరీక్ష కేంద్రంలో సిబ్బందితో సహా అందరూ కాస్త ఆందోళనకు గురయ్యారు.
వదలని సంకల్పం : మధ్యాహ్నం కూడా పరీక్ష రాస్తే గ్రూప్-2 మొత్తం నాలుగు పేపర్లు పూర్తవుతాయి. నాలుగో పేపర్ కూడా రాస్తానని పట్టుబట్టింది. అధికారులు ఎంత చెప్పినా వినలేగదు. ఆమె పట్టు వదలకుండా పరీక్ష రాస్తానని చెప్పడంతో అధికారులు ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ ఆమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
తక్షణమే గర్భిణీ కోసం పరీక్ష కేంద్రంలో 108 అత్యవసర వాహనాన్ని అందుబాటులో ఉంచారు. పరీక్ష బాగా రాయమని రేవతికి వైద్య సిబ్బంది ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. పరీక్ష పూర్తయ్యే వరకు అందరూ టెన్షన్ పడినా, నాలుగో పేపర్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసి రేవతి బయటికి రావడంతో ఆమెను నేరుగా 108 సిబ్బంది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె బంధువులు, ప్రభుత్వ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గ్రూప్ -2 పరీక్షలు - పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
గ్రూప్-2 అభ్యర్థులకు మరో అప్డేట్ - ఈనెల 9 నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు లభ్యం