Chhattisgarh Encounter Today : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ-బీజాపుర్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో SLR,303,12 బోర్ ఆయుధాలతోపాటు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
నిఘా వర్గాల సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు 9 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
150 మందికి పైగా!
ఆగస్టు 29వ తేదీన కూడా నారాయణపుర్ జిల్లా అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టు దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో 150 మందికి పైగా మావోయిస్టులు మరణించారని పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 17 వేల మంది బలయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నక్సల్స్ అంతానికి బలమైన, పకడ్బందీ వ్యూహం అవసరమన్నారు. 2004-14 వ్యవధితో పోలిస్తే 2014-24 మధ్యకాలంలో నక్సల్స్ సంబంధిత ఘటనల్లో 53 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్రమంత్రి తెలిపారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. ఏకకాలంలో భద్రతా కార్యకలాపాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్‌ఐఏ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు మావోయిస్టు హింస నిర్మూలనకు కృషి చేస్తున్నాయని తెలిపారు.