SC ST Sub Classification : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పాలసీలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్రాలకు ఉందా అనే అంశంపై విచారణ జరుపుతున్న ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ మేరకు కేంద్రం తరఫున బుధవారం వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని తుషార్ మెహతా చెప్పారు. రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
"ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లకు మన రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పిస్తోంది. వెనుకబడిన వర్గాల్లోని పైస్థాయిలో ఉన్న వారు ఈ రిజర్వేషన్ ప్రయోజనాలను గరిష్ఠంగా వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. సమాన అవకాశాలు రెండు రకాలుగా పని చేస్తాయి. ఓపెన్ కేటగిరీకి, వెనుకబడిన వర్గాలకు వర్తించే సమాన అవకాశాలు ఒకటైతే- వెనుకబడిన వర్గాల్లో కూడా సమాన అవకాశాలు ఉండాలి. వర్గీకరణ లేకపోతే రిజర్వుడ్ కేటగిరీలలో అసమానతలు ఏర్పడతాయి. వర్గీకరణ అవకాశం లేకపోతే సరైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాలను నిలువరించినట్లు అవుతుంది."
-తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్
'రిజర్వేషన్లు పరిమితం- హేతుబద్ధత అవసరం'
రిజర్వేషన్ ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయని తుషార్ మెహతా గుర్తు చేశారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఉండే రిజర్వేషన్ సీట్లు అరుదైన వస్తువుల వంటివని, వాటిని హేతుబద్ధంగా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. అసలైన లక్ష్యం నెరవేరేలా వీటిని పంపిణీ చేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.
"వెనుకబడిన వర్గాలు/కులాలకు సమానత్వం, సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం, రాజ్యం (ప్రభుత్వం) లక్ష్యం. వర్గీకరణ చేపట్టడం ద్వారా అవసరం ఉన్నవారికి ఈ ప్రయోజనాలు అందుతాయి. రిజర్వుడ్ కోటాలోని రిజర్వుడ్ వర్గాలకు సమానంగా అవకాశాలు కల్పించినట్లు అవుతుంది. సమాన అవకాశాలు పొందలేక శతాబ్దాల పాటు వివక్షకు గురైన వెనుకబడిన తరగతులకు న్యాయం చేయడమే రిజర్వేషన్ల లక్ష్యం. వర్గీకరణ ద్వారానే రిజర్వేషన్ల అసలు లక్ష్యం నెరవేరుతుంది."
-తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రెండు డజన్లకు పైగా పిటిషన్లపై విచారణ జరుపుతోంది. వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో 'ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్' కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కాగా, హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. దీనిపై పునస్సమీక్షించాలని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది.
'కాంగ్రెస్కు కాలం చెల్లింది- రిజర్వేషన్లకు ఆ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమే!'