SC On Jet Airways Liquidation : ఆర్థికంగా కుదేలైన విమానయాన సంస్ఖ జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియ ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో లిక్విడేషన్ (ఆస్తుల విక్రయం)కు ఆదేశించింది. రుణ దాతలు, ఉద్యోగుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్‌ను నియమించాలని ఎన్‌సీఎల్‌టీ ముంబయి బెంచ్‌ను ఆదేశించింది. అసాధారణ రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో జెట్ ఎయిర్‌వేస్ కథ ముగిసినట్లైంది.
అసలు ఏం జరిగిందంటే?
జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ఆర్థిక కష్టాలతో 2019లోనే కార్యకలాపాలు నిలిపివేసింది. దీంతో ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు (NCLT) వెళ్లగా, అక్కడ దివాలా ప్రక్రియ మొదలైంది. ఇందులో జలాన్- కర్లాక్ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్‌వేస్‌ను దక్కించుకుంది. ఆ తర్వాత కన్సార్షియానికి, రుణ దాతలకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాతలు ఎన్‌సీఎల్‌ఏటీ (NCLAT)కి వెళ్లారు. యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాలను అప్పిలేట్ ట్రైబ్యునల్ కూడా సమర్థించింది.
ఎన్‌సీఎల్‌ఎటీ నిర్ణయంపై ఆగ్రహం!
ఆ తర్వాత అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఎస్‌బీఐ, ఇతర రుణదాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను పక్కనపెట్టింది. ఎన్‌సీఎల్‌ఎటీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
దివాలా ప్రక్రియలో విమానయాన సంస్థను చేజిక్కించుకున్న జలాన్ కర్లాక్ కన్షార్షియం ఉద్యోగుల జీత భత్యాలు, నిధులు వెచ్చించడంలో విఫలమైనందున రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సంక్రమించిన అసాధారణ అధికారాలను వినియోగించి లిక్విడేషన్‌కు ఆదేశాలు ఇచ్చింది. రుణదాతలు, ఉద్యోగులు, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రయోజనార్థం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. దీంతో జెట్ ఎయిర్‌వేస్ ఆస్తులను నగదుగా మార్చనున్నారు.