SC On Kanwar Yatra Name Plates : కావడి యాత్ర మార్గంలో ఉన్న హోటళ్లు, తోపుడుబండ్ల ముందు వాటి యజమానుల పేర్లు, వ్యక్తిగత వివరాలతో బోర్డులు పెట్టాలంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. యజమానుల పేర్లతోపాటు వ్యక్తిగత వివరాలను బహిర్గతపరచాల్సిందిగా బలవంతం చేయరాదని స్పష్టం చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
వడ్డించే ఆహారాన్ని మాత్రమే!
యజమానులు వారు వడ్డించే ఆహారాన్ని మాత్రమే ప్రదర్శిస్తారని జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలను సవాల్ చేస్తూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాతోపాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం సోమవారం విచారణ చేపట్టింది.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం!
అయితే విచారణ సందర్భంగా పిటిషనర్లు తమ వాదనను వినిపించారు. "అసలైన ఉద్దేశం కనిపించకుండా మభ్య పెడుతూ ఇచ్చిన ఆదేశాలు ఇవి. నేమ్ ప్లేట్స్ ప్రదర్శించకుండా ఈ ఆదేశాలను ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తారు. ఎవరు మనకు వడ్డిస్తున్నారని కాకుండా తినాలనుకుంటున్న ఆహారాన్ని బట్టి మనం రెస్టారెంట్‌కు వెళ్తాం. గుర్తింపును బట్టి దూరం పెట్టే ఉద్దేశమే ఈ ఉత్తర్వుల్లో కనిపిస్తోంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం" అని న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు.
మహువా మొయిత్రా సంతోషం!
కావడి యాత్ర వివాదంపై సుప్రీం ఇచ్చిన ఆదేశాల పట్ల టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సంతోషం వ్యక్తం చేశారు. "ఆదివారమే పిటిషన్ దాఖలు చేశాం. కోర్టు ఈరోజు(సోమవారం) విచారణ చేపట్టింది. రాజ్యంగంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమైన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించింది. యజమానులు తమ పేర్లను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. మాంసాహారమా లేదా శాకాహారమా అన్నది చెబితే చాలు" అని మొయిత్రా అన్నారు.
#WATCH | On Supreme Court's verdict on 'nameplates in Kanwar Yatra', TMC MP and petitioner Mahua Moitra says " i am happy, we had filed the petition yesterday and it came up in the supreme court today. it is a completely unconstitutional order against the fundament principles of… pic.twitter.com/WLR1IGo8zy
— ANI (@ANI) July 22, 2024
మేమేం ఆదేశాలివ్వలేదు: మధ్యప్రదేశ్ సర్కార్
మరోవైపు, రాష్ట్రంలోని కన్వర్ యాత్ర మార్గంలో దుకాణ యజమానులు తమ పేర్లను ప్రదర్శించాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని మధ్యప్రదేశ్ సర్కార్ స్పష్టం చేసింది. దుకాణదారుల పేర్లను ప్రదర్శించడం తప్పనిసరి కాదని తెలిపింది. ఎటువంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని కోరింది. మధ్యప్రదేశ్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ మీడియా రూల్స్ 2017 ప్రకారం షాపుల ముందు బోర్డులు పెట్టవచ్చని పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ (UDHD) వెల్లడించింది. కానీ ఆ బోర్డులపై షాప్ యజమాని పేరును ప్రదర్శించాల్సిన అవసరం లేదని చెప్పింది.
ఏటా శ్రావణమాసంలో చేపట్టే కావడి యాత్రలో భాగంగా శివభక్తులు నెల రోజులపాటు గంగానది జలాలను కావిళ్లతో సేకరించి స్వస్థలాలకు తరలిస్తారు. ఈ ఏడాది యాత్ర సోమవారం ప్రారంభమైంది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఈ యాత్ర కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశాయి. అయితే దుకాణ యజమానులు తమ పేర్లు ప్రదర్శించాలని ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి.