SC Asks EC Response : పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీగా ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టులో దాఖలైన విషయం పిటిషన్ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. దీనిపై వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై మే 24న మళ్లీ విచారణ జరుపుతామని తెలిపింది.
ప్రతీ పోలింగ్ కేంద్రంలో పోల్ అయిన ఓట్ల సంఖ్యను విడివిడిగా ఫారం-17 సి పార్ట్ 1 స్కాన్డ్ ప్రతుల రూపంలో పొందుపరిచేలా చేయాలని, ఈమేరకు ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏడీఆర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసినా, పోలైన ఓట్ల సంఖ్యను 11 రోజుల తరవాత ఏప్రిల్ 30న ప్రచురించారు. ఏప్రిల్ 26న జరిగిన రెండో దశ పోలింగ్ శాతాన్ని నాలుగు రోజుల తరవాత అందుబాటులో ఉంచారు. పోలింగ్ రోజున ఎన్నికల సంఘం వెల్లడించిన ఓటింగ్ శాతం కన్నా అయిదారు శాతం ఎక్కువగా ఏప్రిల్ 30న గణాంకాలు కనిపించాయి. దీనిపై అనుమానాలు తలెత్తుతున్నాయని ఏడీఆర్ తమ పిటిషన్‌లో పేర్కొంది.
ఇటీవల, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ శాతం గణాంకాలను మరింత పారదర్శకంగా వెల్లడించాలని పౌర సంఘం సభ్యుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. 4,000 మందికి పైగా సంతకాలతో కూడిన లేఖను సమర్పించింది. మొదటి రెండు దశల ఎన్నికలకు సంబంధించి వెల్లడించిన గణాంకాల్లో హెచ్చుతగ్గులను లేఖలో ముఖ్యంగా హైలైట్ చేసింది.
ప్రాథమిక అంచనాలు, తర్వాత సవరణ లెక్కల్లో వ్యత్యాసాలు ఉన్నాయని పౌర సంఘం సభ్యుల బృందం లేఖలో తెలిపింది. ఇది ఎన్నికల ప్రక్రియ కచ్చితత్వం, పారదర్శకతకు సంబంధించి ప్రజల్లో సందేహాలు, ఆందోళనలను రేకెత్తించిందని పేర్కొంది. దేశంలో జరిగే తదుపరి దశ ఎన్నికలు ముగిసిన 48 గంటల్లోగా నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల సంఖ్యను బహిరంగంగా వెల్లడించాలని కోరింది.