Sanatana Dharma Row : డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు స్వల్ప ఊరట లభించింది. సనాతన ధర్మంపై వ్యాఖ్యల వివాదంలో ఆయనతో పాటు మరో ఇద్దరు నేతలు చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారు అధికార పదవుల్లో కొనసాగడాన్ని సవాలు చేస్తూ రెండు హిందూ సంస్థలు, మరో వ్యక్తి పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనితా సుమంత్ కొట్టివేశారు. ప్రకటనలు చేసే ముందు చారిత్రక సంఘటనలను ధ్రువీకరించుకోవాలని సూచించారు. దీంతో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పీకే శేఖర్, ఎంపీ రాజాకు ఊరట లభించినట్లైంది.
స్టాలిన్‌పై సుప్రీం ఫైర్!
అయితే ఉదయనిధి స్టాలిన్‌పై ఇటీవల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. "వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కింద ఉన్న మీ హక్కులను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మీరే రక్షణ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా? మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉన్నారు" అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
గతేడాది సెప్టెంబరులో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వ్యాఖ్యానించారు ఉదయనిధి స్టాలిన్. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అనేక రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపి విచారించాలంటూ ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం- ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.
ఇండియా కూటమిపై ప్రధాని విమర్శలు
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఇండియా కూటమి నేతలు అనుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొన్నాళ్ల క్రితం ధ్వజమెత్తారు. స్వామి వివేకానంద, లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌లకు స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అహంకారపూరిత ఇండియా కూటమిని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
'మణిపుర్, అవినీతి నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ.. కోర్టుల్లోనే తేల్చుకుంటా'
'బీజేపీ ఓ 'విషసర్పం'.. వెళ్లగొట్టాలంటే ముందు ఆ పార్టీ పని పట్టాలి!'