Salman Khan Firing Case : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో అరెస్టైన నిందితుడు అనూజ్ థాపన్(23) ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కస్టడీలో ఉన్న అనూజ్ బుధవారం మధ్యాహ్నం లాకప్‌లో ఉన్న టాయిలెట్లో బెట్ షీట్‌తో ఉరివేసుకున్నాడు. వెంటనే పోలీసులు ముంబయిలో ఉన్న గోకుల్ దాస్ తేజ్ పాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనూజ్ థాపన్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ కేసు
ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. సల్మాన్ నివాసం ఉంటున్న ముంబయి బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్దకు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కాల్పులు జరిపిన నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌ను అరెస్టు చేశారు. అనంతరం వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనూజ్ థాపన్, సోనూ సుభాశ్ చందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా సోను మినహా మిగతా ముగ్గురికి న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది. అనారోగ్యం కారణంగా సోనును కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరలేదు.
లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులే నిందితులు!
అయితే, ఈ నలుగురు నిందితులు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులని పోలీసులు తెలిపారు. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులకు పాల్పడింది తామేనంటూ లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల నేపథ్యంలో ముంబయి పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. సెలబ్రెటీల ఇంటి వద్ద భద్రతను పెంచారు. కాగా, సల్మాన్‌పై బిష్ణోయ్ గ్యాంగ్ గతంలోనూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది. దీంతో అప్పటి నుంచి నటుడికి వై ప్లస్ భద్రత కల్పిస్తున్నారు.
కాల్పులకు భయపడి సల్మాన్ ఖాన్ ఇల్లు మారుతున్నారా? - అసలు విషయం ఇదే - salman khan shoot out case
కాల్పుల సమయంలో ఇంట్లోనే సల్మాన్ - విచారణలో అనూహ్య నిజాలు! - Salman Khans House Firing Case