Guruvayur Temple Weddings : కేరళ త్రిసూర్‌లోని గురువాయూర్ దేవాలయంలో ఆదివారం (సెప్టెంబరు 8) పెళ్లి జాతర నెలకొంది. ఓనం పండుగకు ముందు వచ్చే చివరి ఆదివారం, చింగం మాసం (పంచమి నక్షత్రం) కావడమే అందుకు కారణం. ఆదివారం మంచి ముహూర్తాన్ని మిస్ కాకూడదని, వివాహాలకు అనుకూలమైన రోజు అని నమ్మి గురువాయూర్ గుడిలో 356 జంటలు ఒక్కటయ్యాయి. ఇన్ని వివాహాలు గురువాయూర్ గుడి వెలుపల ఉన్న మండపంలో జరగడం ఇదే తొలిసారి.
దేవస్థానం ముమ్మర ఏర్పాట్లు
భక్తుల దర్శనం, కళ్యాణ మహోత్సవాల కోసం గురువాయూర్ దేవస్వామ్ బోర్డు ఏర్పాట్లు చేసింది. వివాహాల కోసం దేవస్వామ్ ఆరు మండపాలను అందంగా అలకరించారు. వరుడు, వధువు, వారి బంధువులు దేవాలయం దక్షిణం వైపున ఉన్న తాత్కాలిక పండల్లోని కౌంటర్ వద్ద టోకెన్లు తీసుకోవాలి. అప్పుడు వారిని మేల్పత్తూర్ ఆడిటోరియంలోకి అనుమతిస్తారు. వధూవరులు, ఫొటోగ్రాఫర్ సహా 24 మందిని మాత్రమే మండపం లోపలికి అనుమతిస్తారు. వేకువజామున నాలుగు గంటల నుంచే వివాహాలు మొదలయ్యాయి.
ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి
కేరళలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో గురువాయూర్ టెంపుల్ ఒకటి. ఇక్కడ మూడు ముళ్లు వేస్తే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని కేరళ వాసుల నమ్మకం. అలాగే మొదటి నెల చింగం మాసం వారి జీవితాలకూ శుభారంభంగా భావిస్తారు మలయాళీలు. అందుకే ఈ నెలలో వివాహాలు చేసుకునేందుకు కేరళ వాసులు మొగ్గు చూపిస్తారు. ఈ క్రమంలోనే సెప్టెంబరు 8న(ఆదివారం) 356 జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గతంలో ఒకేరోజు 227 వివాహాలు జరగాయి. ఆ రికార్డు ఈ ఏడాది బద్దలైపోయింది.
గుడి లోపల పెళ్లిళ్లు జరగవు!
అయితే గురువాయూర్ గుడిలో మాత్రం పెళ్లిళ్లు జరగవు. ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం పెళ్లైన రోజు నవ దంపతులు గుడిలోకి పెళ్లకూడదనే ఆచారం ఉంది. అందుకే కొత్త జంటలు గుడిలో పెళ్లిళ్లు చేసుకోరని జ్యోతిష్యుడు రామ్ కుమార్ ఫుధువాల్ తెలిపారు. గుడి బయట ఉన్న మండపంలో వివాహాలన్నీ జరుగుతాయని చెప్పుకొచ్చారు. గతేడాది కూడా గురువాయూర్ దేవాలయంలో భారీగా వివాహాలు జరిగాయి. అప్పుడు దేవస్థానం పగలు, రాత్రి కూడా పెళ్లిళ్లు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.