Rajanth Singh On Agnipath Scheme : ప్రస్తుతం అమలవుతున్న అగ్నిపథ్ లేదా అగ్నివీర్ రిక్రూట్మెంట్ స్కీమ్‌లో అవసరమైతే మార్పులు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. గురువారం టైమ్స్ నౌ సమ్మిట్‌లో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అగ్నివీరుల భవిష్యత్తులను సురక్షితంగా ఉంచేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి హామీ ఇచ్చారు.
రక్షణ దళాల్లో యువతరం ప్రాధాన్యాన్ని వివరించిన మంత్రి అగ్నివీర్ పథకాన్ని మరోమారు సమర్థించారు. సేనా మే యూత్‌ఫుల్‌నెస్ హోనీ చాహియే (సైన్యంలో యువత ఉండాలి) అని అన్నారు. 'దీని పట్ల ప్రస్తుత యువతరం ఉత్సాహంగా ఉందని నేను భావిస్తున్నా. వీరంతా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారని నమ్ముతున్నా. ఈ పథకం (అగ్నివీర్)లో భాగంగా వీరి భవిష్యత్తులను సురక్షితంగా ఉంచేందుకు మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవసరమైతే మరిన్ని మార్పులు చేసేందుకు కూడా కట్టుబడి ఉన్నాం' అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
-
"Government open to change in Agniveer scheme if needed": Rajnath Singh
— ANI Digital (@ani_digital) March 28, 2024
Read @ANI Story | https://t.co/UK2mS3e5tz#rajnathsingh #agniveerscheme #Defence pic.twitter.com/SJAF68lG5h
Agnipath Scheme : త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం 2022 జూన్‌లో 'అగ్నిపథ్' పథకాన్ని ప్రకటించింది. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. నాలుగేళ్లు మాత్రమే సర్వీస్ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్‌మెంట్‌కు సిద్ధం అవుతున్న పలువురు యువకులు మండిపడ్డారు.
ఈ పథకం కింద నియమితులైన యువతీయువకులను అగ్నివీరులుగా పిలుస్తారు. వీరు 4 సంవత్సరాల పాటు సర్వీసులో ఉంటారు. ఇందులోనే 6 నెలల శిక్షణా కాలంతో పాటు 3.5 ఏళ్ల ఉద్యోగం ఉంటుంది. నాలుగు ఏళ్ల తర్వాత సర్వీసు నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత సాయుధ దళాల్లోనే కొనసాగేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం వీరికి (అగ్నివీరులకు) ఉంటుంది.
'ఇంజిన్ల ఎగుమతిదారుగా భారత్!'
మరోవైపు 'ఆత్మనిర్భర్ భారత్' అంశంపైనా ఈ సమ్మిట్‌లో మాట్లాడారు రాజ్‌నాథ్. ఇంజిన్‌లను ఎగుమతి చేసే దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలని చూస్తున్నామని అన్నారు.
"దేశాన్ని ఇంజిన్‌లను ఎగుమతి చేసే దేశంగా మార్చాలనుకుంటున్నాము. ఇందుకోసం భారత్‌లో ఎలాంటి ఇంజిన్‌లను తయారు చేయవచ్చో, ఇందుకు కావాల్సిన సాంకేతికతను పంచుకోవడానికి ఏ దేశాలు సిద్ధంగా ఉన్నాయో పరిశీలించమని నేను డీఆర్డీఓను కోరాను. ఈ ఇంజిన్లన్నీ భారతీయుల ద్వారానే తయారు చేయిస్తాం."
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
అలాగే భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్న ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి స్పందించారు. మన దేశ సరిహద్దులను ఎవరూ ఆక్రమించుకోలేదు. అవి పూర్తి సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈడీ కోర్టుకు కేజ్రీవాల్- లిక్కర్ స్కామ్‌పై కీలక సమాచారం రివీల్! - Kejriwal ED Custody Live Updates
సీఎం ఇంట సంతోషాల పండుగ- ఆడపిల్లకు జన్మనిచ్చిన భగవంత్ మాన్ భార్య - Punjab Cm New Born Baby